రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం..

Wait 5 sec.

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఒక ముఖ్యమైన, ఊరటనిచ్చే సదుపాయాన్ని కల్పించింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు, సైబరాబాద్ ప్రాంతంలో నివసించే వారికి ఉపయోగపడేలా.. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో చేసింది. ఈ ప్రత్యేక సదుపాయం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (CPRO) శ్రీధర్ తెలిపారు. సాధారణంగా.. దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, లేదా నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్) వంటి ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరుతాయి. అయితే.. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు రైలు ఎక్కడానికి చాలా దూరం ప్రయాణించి, ప్రధాన స్టేషన్లకు చేరుకోవాల్సి వచ్చేది. సంక్రాంతి సమయంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్న హైటెక్ సిటీ స్టేషన్‌లో ప్రత్యేక హాల్టింగ్ ఇవ్వడం ద్వారా.. సైబరాబాద్ ప్రాంత ప్రజలకు, ఐటీ ఉద్యోగులకు ప్రధాన స్టేషన్ల వరకు వెళ్లే ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయి. ప్రధాన స్టేషన్లలో అనవసరమైన రద్దీని తగ్గించడంలో ఈ నిర్ణయం సహాయపడుతుంది. రైల్వే అధికారులకు ఈ స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వడం ద్వారా సంక్రాంతి రద్దీని మరింత సమర్థవంతంగా నిర్వహించడం సులభమవుతుంది.ఈ 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు, జనవరి 7 నుంచి 20వ తేదీ మధ్య తమ బోర్డింగ్ స్టేషన్‌ను హైటెక్ సిటీగా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక హాల్టింగ్ కేవలం రెండు వారాల తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. ప్రయాణికులు రైలు బయలుదేరే సమయాన్ని ముందుగానే సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే శాఖ ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లు చేయడం ద్వారా పండుగల సమయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి కృషి చేస్తోంది.