తెలంగాణలోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించి, వారిని ఉపాధి, ఉద్యోగాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రా (ఏటీసీ)ల ద్వారా రానున్న కాలంలో ఏకంగా 2 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేసిన ఏటీసీ ప్రిన్సిపాళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఐటీఐలను (పారిశ్రామిక శిక్షణ సంస్థలు) ఏటీసీలుగా ఆధునీకరించడం అనేది రాష్ట్ర యువత భవిష్యత్తుకు అత్యంత కీలకం అన్నారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏటీసీలలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను మార్పులు చేయాలని ఆదేశించారు. కేవలం సాంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా, దీర్ఘకాలికంగా ఉపయోగపడే అధునాతన సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆటోమేషన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, ఇండస్ట్రీ 4.0 వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంచడం ద్వారా నిపుణులైన కార్మిక బలగాన్ని సిద్ధం చేయాలన్నారు. 'ఐటీఐలను ఏటీసీలుగా ఆధునికీకరించడంతో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు వస్తాయి. యువత ఉపాధి సవాళ్లను సమర్థంగా అధిగమించొచ్చు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా నిపుణులైన ఆధునిక కార్మిక బలగాన్ని సిద్ధం చేయాలి' అని మంత్రి వివేక్ పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ఏటీసీల ఆధునీకరణ కార్యక్రమానికి టాటా గ్రూపు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఈ విజయవంతమైన నమూనా రాష్ట్రంలో మరింతమంది యువతకు ఉపయోగపడేలా, టాటా సంస్థ మరిన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో టాటా సంస్థ సహకారం కీలకమైన భాగస్వామ్యమని ఆయన ప్రశంసించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థుల హాజరు శాతంపై ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. కోర్సు మధ్యలో డ్రాపౌట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ ఆధునిక నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్క విద్యార్థి విజయవంతంగా పూర్తి చేయడం ద్వారానే 2 లక్షల ఉద్యోగాల లక్ష్యం చేరుకోగలమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, ఉపాధి కల్పన శాఖ సంయుక్త సంచాలకులు ఎస్‌వీకే నగేశ్, టాటా గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, యువత బంగారు భవిష్యత్తుకు ఈ ఏటీసీలు వేదిక కానున్నాయని అధికారులు తెలిపారు.