తెలంగాణలో మళ్లీ వానలు.. అప్పటి వరకు గజ గజ వణకాల్సిందే..!

Wait 5 sec.

తెలంగాణలో ఈ సంవత్సరం శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయి, ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి, చల్లటి గాలులు, అలాగే ఆకాశం నిర్మలంగా ఉండటం వలన పడిపోతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొమురం భీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో, వికారాబాద్‌ జిల్లా తాండూరులో 8.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 8.4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌ 8.6 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డిలో 8.6 డిగ్రీల సెల్సియస్, రాజన్న సిరిసిల్లలో 9 డిగ్రీల సెల్సియస్, మెదక్‌ 9.6 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి 9.8 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌ 9.9 డిగ్రీల సెల్సియస్, నిర్మల్‌ జిల్లాలో 9.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత పెరిగింది. శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 13 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. హెచ్స సీయూలో 9.8 డిగ్రీల సెల్సియస్, బీహెచ్ఈఎల్ 11.1, రాజేంద్రనగర్ 11.6, గచ్చిబౌలి 11.9, కుత్బుల్లాపూర్ 12.5, వెస్ట్ మారేడ్‍పల్లి 12.6, గాజుల రామారం 13.3, చందానగర్ 13.9, ఎల్బీ స్టేడియం 13.9, జూ పార్క్ 13.9, కార్వాన్ 13.9, బేగంపేట 14.1, మల్కాజిగిరి 14.1, షేక్ ‌పేటలో 14.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. ఇక నవంబర్ 21 వరకు చలి తీవ్ర విపరీతంగా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయని.. డిసెంబర్ మెుదటి వారంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.