22k Gold Rate: భారతీయులకు పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారు ఆభరణాలు ధరించడం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎక్కువగా మహిళలు ఈ ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. ఇంకా మహిళల అందాన్ని మరింత పెంచుతుందని కూడా చెబుతుంటారు. అయితే.. బంగారం కొంత కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా మారింది. ఆపదలో ఆదుకుంటుందని నమ్మడంతో.. అటువైపు పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. దీంతో రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోయాయి. ఇక్కడ యూఎస్ డాలర్ కూడా పుంజుకోవడం.. బంగారం ధరల పతనానికి కారణమైంది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.దేశీయంగా గత 4 రోజులుగా రేట్లు స్థిరంగానే ఉంటున్నాయి. అంతకుముందు కూడా వరుసగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఇప్పుడు రూ. 1,11,850 వద్ద ట్రేడవుతోంది. నవంబర్ 7న ధర రూ. 500 తగ్గింది. ఇక 24 క్యారెట్లకు చెందిన మేలిమి బంగారం ధర 10 గ్రాములు ఇప్పుడు రూ. 1,22,020 పలుకుతోంది. చివరిసారిగా అక్టోబర్ 17న బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని నమోదు చేశాయి. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధర తులం అప్పుడు వరుసగా రూ. 1,21,700; రూ. 1,32,770 గా ఉండేవి. అక్కడి నుంచి ప్రస్తుత ధరలు చూస్తే రూ. 10 వేల వరకు పడిపోయాయి. దీంతో కొనుగోలు దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలా ఉంటే.. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 1.65 లక్షలుగా ఉంది. ఇక్కడ కూడా 4 రోజులుగా రేటు మారలేదు. ఇక్కడ అక్టోబర్ 15న కేజీకి ఏకంగా రూ. 2.07 లక్షల మార్కు వద్ద ఉండగా.. అక్కడి నుంచి 25 రోజుల్లో రూ. 42 వేలు దిగొచ్చింది.దేశీయంగా రేట్లు కాస్త ఊరట కల్పిస్తున్నా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా మళ్లీ ధరలు పుంజుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4040 డాలర్ల మార్కు దాటింది. దీనికి ముందు ఇది 4 వేల డాలర్ల స్థాయిలో కదలాడింది. సిల్వర్ రేటు 49 డాలర్ల మార్కు అధిగమించింది. ఇక డాలరుతో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 88.73 వద్ద ట్రేడవుతోంది.