ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయా.. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై అంబటి రాంబాబు ప్రశంసలు

Wait 5 sec.

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి తిరుమలలో అన్న ప్రసాదాలపై ప్రశంసలు కురిపించారు. అన్నప్రసాదం నిర్వహణ అద్భుతంగా ఉందని.. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదాలు రుచికరంగా, పరిశుభ్రంగా ఉన్నాయని కితాబిచ్చారు. నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించినట్లు అంబటి రాంబాబు చెప్పారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శనం అనంతరం అందరితో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి వెళ్లారు. అక్కడ అందించిన భోజనాన్ని కేవలం ఆహారంగా కాకుండా, సాక్షాత్తూ భగవంతుడు అందించిన ప్రసాదంగా ప్రశంసించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆ ప్రసాదం చాలా రుచికరంగా ఉందని, భవనాన్ని అత్యంత పరిశుభ్రంగా (హైజినిక్‌గా) నిర్వహిస్తున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని, ప్రసాదం స్వీకరించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో అన్నారు. ఈ అనుభవాన్ని వివరిస్తూ.. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత ఆయన తిరుమల యాత్రపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేశారు. సాధారణ రోజుల్లోనే ప్రతిరోజూ దాదాపు 90,000 మంది భక్తులకు తిరుమలలో అన్నప్రసాదం అందిస్తున్నారన్నారు మాజీమంత్రి అంబటి రాంబాబు. బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక పండుగ సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అప్పుడు లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల మంది వరకు భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని అంబటి రాంబాబు చాలా ఆశ్చర్యపోయారు. ఈ బృహత్తర అన్నప్రసాదం కార్యక్రమం అంతా భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన విరాళాలతోనే కొనసాగుతోందని ఆయన వివరించారు. భక్తుల దాతృత్వంతోనే ఇంతమందికి భోజనం పెట్టగలుగుతున్నారi అన్నారు.అన్నదాన కార్యక్రమానికి రూ. 2,700 కోట్ల విరాళాలు అందాయని.. ఆ వడ్డీతోనే అన్నదానం జరుగుతోందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. 1985 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సేవ వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం ఉందని ఆయన అన్నారు. అన్నప్రసాదం ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగడం వెనుక ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం, ఆశీస్సులే కారణమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ, వీలైతే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం ఏదో ఒక సమయంలో తప్పకుండా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి, భగవంతుని ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ అన్నప్రసాదం భక్తులకు దైవాశీస్సులను అందిస్తుందని అంబటి రాంబాబు తెలిపారు.