ప్రముఖ కవి, గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ గాయకుడు (64) కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో అభిమానులు, సాహితీ లోకం విషాదంలో మునిగింది. ఇక అందెశ్రీ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకాని తీరని లోటని అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జులై 18న ఆయన జన్మించారు. చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించారు. ఏ విధమైన సాహితీ నేపథ్యం లేకుండానే తనలోని అపారమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన పాటల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందెశ్రీ కేవలం కవిగానే కాక, తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన తన పాటలతో, కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి నూతనోత్తేజాన్ని ఇచ్చారు.'జయ జయహే తెలంగాణ' గేయం ఆయన రాసిన గేయాలలో అత్యంత ప్రజాదారణ పొందింది. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ పాట ఉద్యమకారులను ఎంతగానో ఉత్తేజపరిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి, ఆయనకు ఘనమైన గౌరవాన్ని అందించింది. ఈ పాట తెలంగాణ రాష్ట్ర సమున్నత చరిత్రను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. అందెశ్రీ అనేక సినిమాలకు పాటలు కూడా రాశారు. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. అందెశ్రీ మృతి వార్త విని రాష్ట్ర రాజకీయ, సాహిత్య ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు.