మహిళలు, బాలికల సంరక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు వారి సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తూనే.. మరోవైపు వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసినవే శక్తి బృందాలు. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ ఈవ్ టీజర్ ఆట కట్టించింది శక్తి టీమ్. ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద ఓ విద్యార్థి.. ఈవ్‌టీజింగ్ చేస్తున్నాడని కాల్ వచ్చింది. ఈ కాల్ మీద శక్తి టీం వెంటనే స్పందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న శక్తి టీం అతన్ని గుర్తించింది. కౌన్సిలింగ్ నిమిత్తం ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. మరోవైపు మహిళల భద్రత కోసం శక్తి టీం నిరంతరం పహారా కాస్తూ ఉంటుందని.. మహిళలకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 112 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను, మహిళల్ని వేధించేవారు , ఈవ్‌టీజర్లపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ శక్తి బృందాలు ఏర్పాటు చేశారు. అమ్మాయిలు వెంటపడుతూ వేధించేవారితో పాటు సెల్‌ఫోన్, మెయిల్స్‌కు మెసేజులు పెడుతూ సోషల్ మీడియాలో వేధించేవారిపై కూడా శక్తి బృందాలు దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 శక్తి బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం పరిధిలో నాలుగు చొప్పున. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో రెండు.. ప్రతి పోలీసు సబ్‌ డివిజన్‌లో ఒకటి చొప్పున శక్తి బృందాలను మోహరించారు. ప్రతి శక్తి టీమ్‌లో ఓ ఎస్ఐ, ఆరుగురు సిబ్బంది ఉంటారు. మరోవైపు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, అమ్మాయిలు శక్తి టీమ్‌లను నేరుగా సంప్రదించవచ్చు. 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. లేదా శక్తి యాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరి వివరాలను రహస్యంగా ఉంచుతారు. అలాగే శక్తి టీమ్ సభ్యులు బహిరంగ ప్రాంతాల్లో సివిల్ డ్రెస్సులలో తిరుగుతూ నిఘా పెడతారు. రహస్య కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాల సాయంతో వేధింపుల్ని చిత్రీకరిస్తారు. వీటి సాయంతో పక్కా సాక్ష్యాధారాల ఆధారంగా కేసులు నమోదు చేస్తారు. మరోవైపు మహిళలు లైంగిక వేధింపులతో పాటుగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు 112 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుంటామని హామీ ఇస్తున్నారు.