Jubilee Hills Exit Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు..?

Wait 5 sec.

జూబ్లీహిల్స్ పోలింగ్ మరికాసేపట్లో ముగియనుండటంతో.. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా విజేత ఎవరు కాబోతున్నారనే అంచనాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆయా పార్టీల కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతాయా..? లేక నిరాశను కలిగిస్తాయా అనేది చూడాలి. తుది విజేతను నిర్ణయించే ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. తెలంగాణ రాజకీయంపై ప్రభావం చూపనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం లభించింది. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో చెప్పబోతుందనే అంచనాలు ఉండడంతో.. ఇప్పుడు అందరి దృష్టి వివిధ సంస్థలు ప్రకటించబోయే ఎగ్జిట్ పోల్స్పై కేంద్రీకృతమై ఉంది.ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్) మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే నడిచింది. బీఆర్‌ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, భారతీయ జనతా పార్టీ (భాజపా) నుంచి లంకల దీపక్‌రెడ్డి తలపడ్డారు. ఈ పోలింగ్ సరళి మూడు ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.జూబ్లీహిల్స్ చరిత్రను పరిశీలిస్తే.. ఇక్కడ పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో (2023) 47.58% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ సుమారుగా 50 శాతానికి పైగా నమోదు అవ్వనున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ 47.16 శాతంగా నమోదైంది. ఈ పోలింగ్ శాతం ఏ పార్టీకి లాభిస్తుందనే అంశంపై రాజకీయ విశ్లేషకులు దృష్టి పెట్టారు. సాధారణంగా తక్కువ పోలింగ్ పట్టణ ప్రాంతాల్లో అధికార వ్యతిరేక ఓటును ప్రభావితం చేయవచ్చని ఒక వాదన ఉండగా, సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉన్న పార్టీకి మేలు చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది.