దేశ రాజధాని ఘటనపై ఎన్ఐఏ, పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారకుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు ఏజెన్సీలకు కీలక ఆధారం లభ్యమైంది. ఐ20 కారుతో పేలుడుకు పాల్పడిన అనుమానితుడు డాక్టర్ ఉమర్ నబీ పేరుతో ఉన్న మరో వాహనం కోసం విస్తృతంగా గాలించారు. రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ (DL10CK0458)ను తాజాగా కనుగొన్నారు. హర్యానాలోని ఖండ్వాలి గ్రామంలోని ఒక ఫామ్‌హౌస్ వద్ద ఆ కారును వదిలి నిందితులు పరారయినట్టు పోలీసులు గుర్తించారు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఈ కరు ఈశాన్య ఢిల్లీలో నకిలీ చిరునామాతో కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ వాహనం కోసం ఐదు బృందాలను రంగంలోకి దింపి, పొరుగున ఉన్న ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. కారు నెంబరు సహా వివరాలను అన్ని సరిహద్దు యూనిట్లకు పంపారు. ఈ వాహనాన్ని కార్యకలాపాల కోసం ఉపయోగించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో పలు ప్రాంతాలు, హర్యానాలోని ఫరీదాబాద్‌‌లో అక్టోబరు 19 నుంచి భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. భద్రత దళాల తనిఖీలతో తీవ్ర ఒత్తిడి కారణంగా టెర్రర్ మాడ్యూల్‌లో భాగమైన డాక్టర్ ఉమర్ తరుచూ లొకేషన్లు మార్చినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఉగ్రవాదులు 2008 నవంబరు 26న దేశ రాజధాని ముంబయి జరిగిన ఉగ్ర పేలుళ్ల తరహా దాడులకు ఢిల్లీలో ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఏకంగా 200 బాంబులను తయారుచేసి, ఎర్రకోట, ఇండియా గేట్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని వ్యూహరచన చేశారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యులు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలకంగా వ్యవహరించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టు భావిస్తున్నారు.