ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ.. 30 వేలమందికి అవకాశం..

Wait 5 sec.

మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా పాములు జనావాసాల్లోకి చొరబడి ప్రజలను భయాందోళనకు గురిచేయడం మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాగే పాముకాటు వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఏటా 3 ,500 మంది. అందులో పది శాతం అంటే 350 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే విధి కేవలం పాముకాటు నుంచి ప్రజలను రక్షించడమే కాదు.. ప్రజల నుంచి పాములను రక్షించడం కూడా.. అంటే జనావాసాల్లోకి ప్రవేశించిన పాములను బంధించి సురక్షితమైన ప్రాంతంలో వదిలేయటం..మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారించేందుకు ఏపీ అటవీ శాఖ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ (HANUMAN) పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ కింద ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్‌ను ఎంపిక చేస్తారు. వారికి తగిన శిక్షణ అందిస్తారు. జనావాసాల్లోకి చొరబడిన పాములను రక్షించడంతో పాటుగా పాముకాటుకు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వీరి విధి.మరోవైపు వానాకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లల్లోకి, పంట పొలాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీంతో జనం భయాందోళనకు గురౌతుంటారు. పాములను ఎలా బంధించాలనే దానిపై అవగాహన లేక వాటిపై దాడి చేసి చంపేస్తుంటారు. అయితే సర్పమిత్ర వాలంటీర్లను అందుబాటులోకి తెస్తే ఇలాంటి సమయంలో పాములను ఎలా బంధించాలనే దానితో పాటుగా ఆపద వేళ ప్రథమ చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థను హనుమాన్ ప్రాజెక్టులో భాగం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సర్పమిత్ర వాలంటీర్లకు ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఆదేశించారు. ఏనుగుల దాడుల తర్వాత పాముకాట్లు అనేవి ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉంటున్న యువతకు ట్రైనింగ్ ఇచ్చి సర్పమిత్ర వాలంటీర్లుగా నియమిస్తామని చెప్తున్నారు. దీనివలన ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటుగా పాములను కూడా సంరక్షించే వీలవుతుందని అంటున్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సర్పమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సర్పమిత్ర వాలంటీర్లకు పాములను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. సేఫ్టీ కిట్లు కూడా అందజేయనున్నారు. సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థలో భాగంగా తొలి బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం