ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త. మహబూబ్‌నగర్‌- డోన్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి. ఈ కీలక ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్‌ 20ఏ ప్రకారం.. భూములు ప్రజా ప్రయోజనాలకు అత్యవసరం అని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిర్ణయం ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో అవసరమైన భూములను సేకరించేందుకు రైల్వే శాఖకు అధికారికంగా మార్గం సుగమమైంది.నోటిఫికేషన్‌ జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల వ్యవధిలోగా భూముల యజమానులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించవచ్చు. ఈ అభ్యంతరాలను సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌, మహబూబ్‌నగర్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించిన అభ్యంతరాలు, ఇతర వివరాలను అధికారులు పూర్తిగా సమీక్షించిన తర్వాతే భూసేకరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా పూర్తి చేయాలని రైల్వే శాఖ ఆదేశించింది.మహబూబ్‌నగర్‌-డోన్‌ మార్గం దక్షిణ భారతదేశంలోని . ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. సింగిల్ లైన్ కావడం వల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు జాప్యం జరిగేది, ముఖ్యంగా రద్దీ సమయాల్లో రైళ్లు గంటల తరబడి నిలిచిపోయే పరిస్థితి ఉండేది. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డబ్లింగ్‌ ప్రాజెక్టు ముఖ్యంగా రెండు ప్రధాన లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేస్తున్నారు. డబ్లింగ్ పూర్తయితే ఈ మార్గంలో అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపవచ్చు. ప్రస్తుతం ఉన్న రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. వేగంగా, సమయానికి రైళ్లు గమ్యస్థానాలకు చేరుకోగలుగుతాయి. ఈ మార్గం ద్వారా బొగ్గు, సిమెంట్‌, ఆహార ధాన్యాల వంటి సరకు రవాణా జరుగుతుంది. డబ్లింగ్‌తో సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది, తద్వారా స్థానిక పరిశ్రమలకు, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభిస్తుంది.ఈ ప్రాజెక్టు మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. మెరుగైన రైలు కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే.. దక్షిణ భారతం వైపు వెళ్లే రైల్వే నెట్‌వర్క్ మరింత పటిష్టమవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.