ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన ఘోర బాంబ్‌ పేలుడు కారణంగా శ్రీలంక జట్టు భద్రతా ఆందోళనల్లో పడింది. ఆ పేలుడులో 12 మంది మరణించగా, 27 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రావల్పిండిలో జరగాల్సిన రెండో వన్డే ముందు చోటుచేసుకోవడంతో, శ్రీలంక జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు గురువారం స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. రావల్పిండి స్టేడియం ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉండటంతో, ఆటగాళ్లు భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశానికి తిరిగివెళ్తున్న ఈ ఎనిమిది మంది ఆటగాళ్లు, తరువాత జరగబోయే జింబాబ్వే పాల్గొనే ట్రై నేషన్‌ టీ20 సిరీస్‌లో కూడా పాల్గొనరని సమాచారం.ఈ పరిణామంతో గురువారం జరగాల్సిన రెండో వన్డే రద్దు అయ్యే అవకాశం ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు, స్వదేశానికి వెళ్తున్న ఆటగాళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను పంపేందుకు సిద్ధమవుతోంది. మొదటి వన్డేలో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించగా, శ్రీలంక 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.లాహోర్‌లో 2009లో జరిగిన శ్రీలంక జట్టు బస్‌పై ఉగ్రదాడి ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో ముద్ర వేసింది. ఆ దాడిలో అజంతా మెండీస్, చమింద వాస్, కెప్టెన్‌ మహేళ జయవర్దనే వంటి ఆటగాళ్లు గాయపడ్డారు. పలు పాకిస్తాన్‌ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ తాత్కాలికంగా నిలిచిపోయి, దాదాపు దశాబ్దం పాటు యూఏఈ వంటి తటస్థ ప్రాంగణాల్లో హోమ్‌ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.మళ్లీ 2019 డిసెంబర్‌లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటన ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం చేసిన సందర్భాన్ని సూచించింది. అయితే ఇప్పుడు, మళ్లీ భద్రతా అంశాల వల్ల ఆ దేశ పర్యటన సస్పెన్స్‌లో పడటం పాకిస్తాన్ క్రికెట్‌కు మరో సవాలుగా మారింది. ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్ దేశాలు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించగా, ఇంతలోనే ఇలా జరగడంతో భవిష్యత్‌లో ప్రశ్నలు మొదలయ్యాయి.