ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది.. రాష్ట్రవ్యాప్తంగా బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం)ను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2025 ఆగస్టు 31లోపు నిర్మించిన ఇళ్లు, భవనాలను క్రమబద్ధీరించుకునే అవకాశం కల్పించింది. బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం కింద నాలుగు నెలల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు బీపీఎస్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఇళ్లు, భవనాలను క్రమమద్ధీకరించుకోవాలి అనుకుంటున్నవాళ్లు www.bps.ap.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12 నుంచి 120 రోజుల్లోగా (నాలుగు నెలల్లోగా) దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌టీపీ (లైసెన్స్‌ కలిగిన టెక్నికల్‌ పర్సన్ల) ద్వారా ప్రాసెస్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ మేరకు దరఖాస్తులకు కొన్ని డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. రిజిస్ట్రర్‌ దస్తావేజులు( రిజిస్ట్రర్ డాక్యుమెంట్‌) సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ జారీ చేసిన ఎన్‌కంబరెన్స్, మార్కెట్‌ విలువ సర్టిఫికెట్లతో పాటుగా బిల్డింగ్‌ ప్లాన్ అందజేయాల్సి ఉంటుంది. భవనానికి సంబంధించి రెండు లేటెస్ట్ ఫోటోల (భవనం మొత్తం కనిపించేలా, తేదీ కూడా వచ్చేలా)ను సమర్పించాలి. భవనం నిర్మాణ ప్రాంతం, అనుమతించిన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాల డ్రాయింగ్‌లు కూడా ఇవ్వాలి. ఒకవేళ అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తే కనుక బిల్టప్ ఏరియా, సైట్ ప్లాన్ కూడా ఇవ్వాలి. వీటితో పాటుగా ఇండెమ్నిటీ బాండ్, రోడ్డు విస్తరణకు సమ్మతి తెలియజేస్తూ డాక్యుమెంట్ ఇవ్వాలి. అలాగే స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ (లైసెన్స్‌ ఉండాలి)తో స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్‌ తీసుకుని సమర్పించాలి. విస్తీర్ణం ఆధారంగా ఇళ్లు, భవనాలను సంబంధించి.. చదరపు అడుగుకు రూ.40 నుంచి రూ.400 వరకు పీనలైజేషన్‌ ఫీజులు వసూలు చేస్తారు. ఒకవేళ నిర్మాణంలో ఉల్లంఘనలు ఉంటే.. వాటిపై రూ.20 వేల నుంచి రూ.80 వేల వరకు ఫైన్ (అపరాధ రసుము) విధిస్తారు. అనఫిషియల్ ఫ్లోర్లకు (అనధికార అంతస్తులు) చదరపు అడుగుకు రూ.120 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. ఈ అపరాధ రుసుములు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మార్కెట్‌ విలువ ఆధారంగా విధిస్తారు. అంతేకాదు కొన్ని రాయితీలు కూడా ఉన్నాయి. బీపీఎస్‌ 60 గజాల్లోపు ఇంటి నిర్మాణాలకు (జీ+1) అవసరం లేదు. మొత్తం పీనలైజేషన్‌ రుసుముల్లో 1997 డిసెంబరు 31కి ముందు చేపట్టిన నిర్మాణాలపై 25% రాయితీ కూడా ఇస్తారు. ఒకవేళ నోటిఫైడ్‌ మురికివాడల్లో నివాస భవనాలు ఉంటే కనుక వాటికి 50% రాయితీ ఉంటుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో బీపీఎస్‌ అమలు చేస్తారు. అలాగే పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామ పంచాయతీలలో కూడా బీపీఎస్‌కు అవకాశం ఉంది. బీపీఎస్‌ 2025 ఆగస్టు 13 తర్వాత నిర్మించిన భవనాలకు వర్తించదు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, వివాదాస్పద, యాజమాన్య హక్కు లేని భూముల్లోని నిర్మాణాలలో కూడా బీపీఎస్ వర్తించదు. చెరువులు, వాగులు, కాలువలు ఆక్రమించి కట్టినవి, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్, వీటితో పాగుగా తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన వాటికి కూడా అనుమతి ఉండదు. అనుమతి పొందిన లేఔట్లలోని పార్కింగ్, ఓపెన్‌ స్పేస్, వినోద ప్రదేశాల్లో చేపట్టిన నిర్మాణాలకు కూడా పర్మిషన్ ఇవ్వరు. అధికారులు బీపీఎస్ దరఖాస్తులను 6 నెలల్లో పరిష్కారించాలి.. ఒకవేళ బీపీఎస్ దరఖాస్తులు తిరస్కరిస్తే అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ అప్పీళ్లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలను పరిశీలించి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.