Gold Price Crash: బంగారం ధర గత నాలుగైదు రోజులుగా చూస్తే.. తెలిసిందే. ఆ మధ్య ఆల్ టైమ్ గరిష్టాల నుంచి 10-15 రోజుల పాటు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,380 డాలర్లపైన గరిష్ట స్థాయికి చేరగా.. మళ్లీ 400 డాలర్లకుపైగా తగ్గి 4 వేల డాలర్ల స్థాయి దిగువకు కూడా చేరింది. సిల్వర్ రేటు 55 డాలర్లకు చేరువగా కూడా వెళ్లింది. కానీ గత 4-5 రోజుల్లో చూస్తే ఇది మళ్లీ స్పాట్ గోల్డ్ రేటు 4,200 డాలర్ల మార్కుపైకి చేరింది. సిల్వర్ రేటు మరోసారి 54 డాలర్లపైకి చేరింది. అయితే.. శుక్రవారం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలాయని చెప్పొచ్చు. దీనికి ఒకే ఒక కారణం ఉంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబరు సమయంలో మరోసారి వడ్డీ రేట్లను కచ్చితంగా తగ్గిస్తుందని కొద్దిరోజులుగా అంచనాలు వచ్చిన నేపథ్యంలోనే బంగారం ధర పెరిగిందన్న సంగతి తెలిసిందే. అంటే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. బంగారం ధర పెరుగుతుంది. కానీ ఇప్పుడు అంచనాలు తలకిందులయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సమీప భవిష్యత్తులో తగ్గించకోవచ్చనే సంకేతాలు ఫెడ్ అధికారుల నుంచి వచ్చాయి. దీంతో స్పాట్ గోల్డ్ రేటు అంతకుముందు సెషన్‌లో ఔన్సుకు 4211 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. ప్రస్తుతం వార్త రాసే సమయంలో (నవంబర్ 14 సాయంత్రం 7.40 గంటలకు) ఇది 4050 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. అంటే ఇక్కడ 150 డాలర్లకుపైగా పతనమైంది. గోల్డ్ ఫ్యూచర్స్ రేటు కూడా భారీగా తగ్గింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా 53 డాలర్ల స్థాయి నుంచి ఒకేసారి 50.30 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. తాజాగా ఫెడ్ అధికారులు.. ద్రవ్యోల్బణం ఆందోళనల్ని లేవనెత్తడం సహా లేబర్ మార్కెట్ స్థిరత్వం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేట్ల కోత అంచనాలు 67 శాతం నుంచి 49 శాతానికి పడిపోయాయి. వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నా.. లేదా పెరిగినా.. అప్పుడు బంగారం ఆకర్షణ కోల్పోతుంది. ఈ క్రమంలోనే బంగారం డిమాండ్ తగ్గి రేట్లు భారీగా పతనం అయ్యాయి. ఫెడ్ సంకేతాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా పతనం అయ్యాయి. ఈ కారణంగానే.. బంగారంపై ప్రాఫిట్ బుకింగ్ (లాభాల్ని సొమ్ము చేసుకునేందుకు విక్రయించడం) చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇది రేట్లు మరింత తగ్గేందుకు దారి తీస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం కనిపించకముందే ఇవాళ దేశీయంగా కూడా బంగారం ధర భారీగా దిగొచ్చింది. హైదరాబాద్ నగరంలో ఇవాళ 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 1450 తగ్గడంతో తులం రూ. 1,16,450 కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే రూ. 1580 పతనంతో 10 గ్రాములకు రూ. 1,27,040 కి చేరింది. దీనికి ముందటి రోజు రూ. 3,110 పెరిగంది. ఇక అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రభావం శనివారం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది.