ఉగ్రదాడి కాదా? ఢిల్లీ పేలుడుకు CNG గ్యాసే కారణమా?.. అసలు నిజం ఏంటంటే?

Wait 5 sec.

: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది చనిపోగా, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు కారణం ఉగ్రవాదులు కావొచ్చని పోలీసులు భావిస్తుండగా.. సోషల్ మీడియాలో మాత్రం మరో రకమైన వాదన జరుగుతోంది. ముఖ్యంగా సీపీ రవీంద్ర యాదవ్.. ఈ పేలుడుకు కారణం ఉగ్రవాదులు కాదని, సీఎన్‌జీ గ్యాస్ వల్లే జరిగిందంటూ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తజాగా భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (PIB) స్పందించింది. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి మరీ అసలు నిజం ఏంటో వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ పేలుడుకు కారణం సీఎన్‌జీ (CNG) సిలిండర్ పేలుడు మాత్రమేనని.. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కమిషనర్ (లా అండ్ ఆర్డర్) రవీంద్ర యాదవ్ ఈ విషయాన్ని ధృవీకరించారని కొన్ని సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదు అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. పీఐబీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. "ఈ క్లెయిమ్ పూర్తిగా అవాస్తవం. ఢిల్లీ పోలీసుల నుంచి ఏ అధికారి కూడా లేదా అది ఉగ్రదాడి కాదని ధృవీకరిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు" అని తెలిపింది. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెడుతూ.. అందులో ఈ అంశాలన్నీ వివరించింది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు సహా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), NSG బృందాలు అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేస్తున్నాయని వివరించింది. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది. అప్పటి వరకు పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ధృవీకరించని సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపింది. అధికారిక , విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చే సమాచారంపై మాత్రమే ఆధారపడాలని చెప్పింది. ఇలాంటి సున్నితమైన అంశాలలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం అవుతుందని.. అందుకే సోషల్ మీడియా యూజర్లు సంయమనం పాటించాలని కోరింది.మృతుల సంఖ్య పెరగడానికి కారణం రద్దీనేపేలుడు జరిగిన ప్రాంతం లాల్ ఖిలా మెట్రో స్టేషన్ గేట్ నెం.1 ఎదురుగా ఉండటం, ఈ ఘటన రద్దీగా ఉండే సాయంత్రం రష్ అవర్‌లో జరగడం వల్లే ప్రాణనష్టం భారీగా పెరిగిందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన కారులో పేలుడు సంభవించగానే.. ఆ మంటలు చుట్టుపక్కల ఆగి ఉన్న వాహనాలకు కూడా వ్యాపించాయి. .. 25 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.