జగన్‌కు రూ.7 కోట్లు.. చంద్రబాబుకు కేవలం రూ.25 లక్షలే.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటోందని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీలో మార్పు రాలేదని విమర్శించారు. రుషికొండపై ప్యాలెస్ నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బుతో ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఉండేవారన్నారు. ఈ నెల 14 మరియు 15 తేదీలలో జరగబోయే పెట్టుబడిదారుల సదస్సులో సుమారు 401 ఒప్పందాలు కుదురుతాయని అంచనా వేస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా సుమారు రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదని.. గత ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పినా ఎటువంటి మార్పు రాలేదన్నారు శ్రీభరత్. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఖర్చు రూ.7 కోట్లు అయితే.. ఇప్పుడు పర్యటన ఖర్చు రూ.25 లక్షలు. రాష్ట్రం ఎంత తక్కువ ఖర్చులు చేస్తోంది అనేదానికి ఇదే నిదర్శనం అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలకు అభివృద్ధి అంటే తెలియదని.. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో ఆ పార్టీ నేతలు పీహెచ్‌డీ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.విశాఖపట్నంలో ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో వైఎస్సార్‌‌సీపీ ర్యాలీలు చేయడం దురదృష్టకరం అన్నారు ఎంపీ. మన రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా ఆలోచించాలన్నారు. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని.. వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీలు చేయాలనుకుంటే వేరే సమయంలో చేసుకోవాలని సూచించారు. విశాఖపట్నానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలోనే ఈ ర్యాలీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ర్యాలీల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించి, విశాఖపట్నం ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం తరఫున గట్టిగా స్పందిస్తామని ఎంపీ శ్రీభరత్ హెచ్చరించారు. రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ కోసం వెచ్చించిన నిధులను ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి వినియోగించి ఉంటే, అవి ఇప్పటికే పూర్తయ్యేవని ఆయన వివరించారు. వైసీపీలో వ్యక్తిగతంగా తప్పులు చేసిన వారు చాలా మంది ఉన్నారని ఎంపీ శ్రీభరత్ విమర్శించారు.వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరైనా తప్పు చేస్తే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు ఎంపీ శ్రీభరత్. వైఎస్సా్ర్‌సీపీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారన్నారు. హత్య వంటి తీవ్రమైన నేరాలు చేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. గంజాయి కేసులో ఇరుక్కున్న వారిని జైల్లోకి వెళ్లి పరామర్శించడం కేవలం జగన్‌కే సాధ్యమని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.