ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ‘అపెక్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ యోగా అండ్‌ నేచురోపతి’ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సూచించింది. ఈ ప్రతిష్టాత్మక సంస్థ కోసం భూమిని కేటాయించాలని కోరింది. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ యోగా, నేచురోపతి విభాగం ఆధ్వర్యంలో రానున్న ఈ పరిశోధన కేంద్రం 450 పడకలతో అన్ని ఆధునిక సౌకర్యాలతో సిద్ధం కానుంది.ఈ కొత్త సంస్థలో తొలి ఏడాది నుంచే యూజీ కోర్సులకు 100 సీట్లు, పీజీ కోర్సులకు 20 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇది యోగా, ప్రకృతి వైద్యం రంగాల్లో పరిశోధనలకు, శిక్షణలకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ఎయిమ్స్‌ (AIIMS) తరహాలో, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సంస్థ తన సేవలను అందించనుంది. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన 40 ఎకరాల భూమిని కేటాయించాలని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ లేఖలో స్పష్టం చేసింది. రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సంస్థ రూపుదిద్దుకోనుంది.దేశంలోనే మొట్టమొదటి అపెక్స్‌ యోగా అండ్‌ నేచురోపతి రీసెర్చ్‌ సెంటర్‌ను తమ రాష్ట్రానికి కేటాయించినందుకు ప్రధాని మోదీకి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అపెక్స్‌ యోగా అండ్‌ నేచురోపతి రీసెర్చ్‌ సెంటర్‌ను తమ రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రధాని మోదీ కృషిని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసించారు. ఈ కేంద్రం ద్వారా ప్రకృతి వైద్యంపై పరిశోధనలు పెరిగి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ కొత్త కేంద్రాలు దోహదపడతాయని మంత్రి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు, యునాని వైద్యశాలలు ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల వివిధ రకాల వైద్య సేవలు ఒకే చోట లభిస్తాయి. ధర్మవరంలో ఏర్పాటు కానున్న ఆయుర్వేద కళాశాల ఆయుర్వేద వైద్య విద్యను ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యునాని వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా అందరికీ ఆరోగ్యం అందించాలనేది ప్రభుత్వ సంకల్పం.