ఏపీలోని ప్రధాన ఆలయాల్లో క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేకుండా.. కీలక ఆదేశాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు క్యూలైన్ల తిప్పలు తప్పనున్నాయి. క్యూలైన్లలో ఎక్కువసేపు నిలబడాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను విస్తృతం చేయాలని దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆలయాల్లో 100 కియోస్క్‌ మెషిన్లు ఏర్పాటు చేసి దర్శనం, లడ్డూ టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆలయాల్లో దర్శనాలు, సేవలు, పార్కింగ్ టికెట్లను ఈ-పోస్ (e-POS) యంత్రాల ద్వారా జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ రోడ్డుపై టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయకుడగా.. ఎస్‌బీఐ అందించే ఈ-పోస్ యంత్రాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ యంత్రాల్లో జెనీ యాప్ ద్వారా దేవాదాయశాఖ టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు అనుసంధానించి, చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సూచించారు. ఈ కొత్త విధానంతో భక్తులకు టికెట్లు పొందడం సులభతరం అవుతుంది.. అలాగే క్యూలలో నిలబడే సమయం తగ్గుతుంది. ఈ మేరకు ఎస్‌బీఐ సహకారంతో ఈ-పోస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మనమిత్ర ద్వారా వాట్సాప్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల దర్శనాలు, సేవలు, వసతుల బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ప్రధాన ఆలయాల్లో ప్రత్యేకంగా వాట్సాప్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మనమిత్ర ద్వారా దర్శనం, సేవలు తదితర టికెట్లు ఎలా బుక్‌ చేసుకోవాలో భక్తులకు అవగాహన కల్పిస్తారు. ఇటు దేవాదాయశాఖ ఒక కొత్త డ్యాష్‌బోర్డ్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా ఆలయాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సీఎం కార్యాలయం, ఉన్నతాధికారులు, కమిషనరేట్‌ అధికారులు ఈ డ్యాష్‌బోర్డ్‌ను ఎప్పుడైనా చూడవచ్చు. ఈ డ్యాష్‌బోర్డ్‌లో ఆలయాల జాబితా, వాటి భూములు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ట్రస్ట్‌బోర్డుల వివరాలు ఉంటాయి. అంతేకాకుండా, ప్రధాన, ముఖ్య ఆలయాలకు రోజువారీగా ఎంతమంది భక్తులు వచ్చారో కూడా రియల్‌టైమ్‌లో తెలుస్తుంది. ఈ సమాచారం అంతా ఒకేచోట అందుబాటులో ఉండటం వల్ల ఆలయాల నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుంది. అధికారులు ఈ సమాచారాన్ని ఉపయోగించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్థం వంద కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టచ్‌స్క్రీన్ కియోస్క్‌ల ద్వారా భక్తులు నేరుగా దర్శనం, వివిధ సేవల టికెట్లను కొనుక్కోవచ్చు. కరూర్‌ వైశ్యా బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ వంద కియోస్క్‌లను ఉచితంగా అందిస్తోంది. వీటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను కూడా ఆ బ్యాంకే తీసుకుంటుంది. ఈ కియోస్క్‌ల వల్ల భక్తులు తమకు కావలసినన్ని టికెట్లను నమోదు చేసుకుని, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేస్తే వెంటనే టికెట్లు పొందవచ్చు.