ఆపరేషన్ మాతృభూమి.. థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న 197 మందిని స్వదేశానికి చేర్చిన భారత్

Wait 5 sec.

: సైబర్ స్కామ్ ఉచ్చులో చిక్కుకొని.. థాయిలాండ్‌లోని మే సాట్ ప్రాంతంలో నిర్బంధంలో ఉన్న 197 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తరలించే బృహత్తర ఆపరేషన్‌ను భారత ప్రభుత్వం సోమవారం విజయవంతంగా పూర్తి చేసింది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన రెండు ప్రత్యేక విమానాలలో.. ఆపరేషన్ మాతృభూమి పేరిట ఈ భారీ తరలింపు ప్రక్రియను చేపట్టింది. ఈ కీలక ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి థాయిలాండ్ ప్రధాన మంత్రి అనూటిన్ చార్న్‌విరాకుల్ స్వయంగా మే సాట్ విమానాశ్రయాన్ని సందర్శించారు. థాయిలాండ్‌లోని భారత రాయబారి నాగేష్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు.భారత ప్రభుత్వం తమ పౌరులను వేగంగా స్వదేశానికి రప్పించేందుకు చేసిన కృషిని థాయిలాండ్ ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ముఖ్యంగా మయన్మార్‌లోని స్కామ్ కేంద్రాల నుంచి విడుదలైన భారతీయ పౌరుల తరలింపులో థాయ్ అధికారులు నిరంతర సహకారాన్ని అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమావేశంలో ఇరు దేశాలు ప్రాంతీయ సరిహద్దు నేరాలు, సైబర్ మోసాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలను ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉమ్మడి లక్ష్యం కోసం ఇరు దేశాల సంబంధిత ఏజెన్సీల మధ్య సహకారాన్ని మరింత పెంచడానికి నిర్ణయించారు.ఈ తరలింపులో స్వదేశానికి చేరుకున్న పౌరులు ఇటీవల మయన్మార్‌లోని మ్యావాడి ప్రాంతం నుంచి థాయిలాండ్‌లోకి ప్రవేశించారు. మ్యావాడిలోని అక్రమ సైబర్ స్కామ్ కేంద్రాలలో పని చేస్తున్నందున వీరిని థాయ్ అధికారులు ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు నిర్బంధించారు. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్ మాయ్‌లోని భారత కాన్సులేట్, థాయ్‌లాండ్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఈ తరలింపును సులభతరం చేశాయి.విదేశాలలో కష్టాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, రక్షణను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఈ తరలింపు ఒక భాగం కాగా.. రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. "విదేశాలలో ఉద్యోగ ఆఫర్‌లను అంగీకరించే ముందు.. విదేశీ యజమానుల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలి. రిక్రూటింగ్ ఏజెంట్లు, కంపెనీల పూర్వ చరిత్రను తప్పకుండా తనిఖీ చేయాలి" అని సూచించారు. అంతేకాకుండా భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు థాయిలాండ్‌లోకి అందించే వీసా రహిత ప్రవేశం కేవలం పర్యాటకం, స్వల్పకాలిక వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమేనని.. దీనిని థాయిలాండ్‌లో ఉద్యోగం కోసం దుర్వినియోగం చేయకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.