ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో నూతన మార్పులు తెస్తున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. ప్రత్యేక డిజైన్‌, ప్రపంచ స్థాయి వసతులతో పాఠశాలలు ఏర్పాటు చేయడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో పైలట్ ప్రాజెక్టు కోసం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జడ్‌పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం నిడమర్రు పాఠశాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐదు ఎకారాల విస్తీర్ణంలో 22 గదులతో ఉన్న నిడమర్రు పాఠశాల ఉంది. ఈ స్కూల్ భవనాలను రూ. 14 కోట్ల ఖర్చుతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న జీ+1 భవనంపై మరో అంతస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆ అంతస్తులో ఇండోర్‌ స్టేడియం, యాంఫీ థియేటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో వాకింగ్, రన్నింగ్‌ ట్రాక్, ప్లే గ్రౌండ్ తదితర పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. నిడమర్రు జడ్‌పీ ఉన్నత పాఠశాలను నిర్మాణాన్ని యూ ఆకారంలో డిజైన్‌ చేశారు. ఈ స్కూల్‌లో ప్రాథమిక విద్య నుంచి.. ప్రాథమికోన్నత స్థాయి వరకు బోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్‌ అక్షరాస్యత 21వ శతాబ్దపు నైపుణ్యాలతో కూడిన విద్యా ప్రమాణాలను ఈ లీప్ స్కూళ్లలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ లీప్ పాఠశాలల్లో అద్భుతమైన భవనాలు, ఆహ్లాదపరిచే ప్రాంగణాలు, మోడర్న్ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచం ఏపీ మోడల్ వైపు చూడాలి.. అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే ఐదేళ్లలో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా.. ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ తెస్తామని మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాను కష్టమైన విద్యాశాఖను కోరుకున్నానన్నారు. కేజీ టు పీజీ విద్యలో ప్రక్షాళన చేయాలని భావించానని తెలిపారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో 9 నుంచి 3 మధ్య, క్విఎస్‌ టాప్‌ -100 ర్యాంకింగ్స్‌లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారన్నారు.లీప్ యాప్.. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం ఎక్కువ యాప్‌లు ఉండేవి. ప్రధానంగా యాప్‌లో పాఠ్యపుస్తకాల పంపిణీ, మన బడి- నాడు నేడు, పీఎంశ్రీ వంటి వివరాలను నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్‌లు ఉండేవి. అయితే టీచర్లు ఇన్ని యాప్‌లలో వివరాలు నమోదు చేయడంతో పాటుగా ఆ యాప్‌లకు సంబంధించిన.. వివరాలు, పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవడం కష్టంగా ఉండేది. అయితే ఈ టీచర్లు తమ ఫేస్ రికగ్నేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్‌బోర్డు అనే ఆరు విభాగాలు ఉంటాయి. దీంతో ఉపాధ్యాయులు ఒకేసారి అన్ని వివరాలు నమోదు చేసుకోవచ్చు.