తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రచయిత, ప్రముఖ కవి, గేయ రచయిత తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున లాలాగూడలోని ఇంట్లో కుప్పకూలి పడిపోయిన అందెశ్రీని కుటుంబసభ్యులు హుటాహుటినగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. తాజాగా.. మృతికి కారణాలను గాంధీ ఆస్పత్రి హెచ్‌వోడీ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూర మీడియాకు వెల్లడించారు. అందెశ్రీ హార్ట్‌స్ట్రోక్ కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన గత 15 ఏళ్లుగా హైపర్‌ టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్యతో బాధపడుతున్నారు. గత నెల రోజులుగా ఆయన బీపీ కంట్రోల్‌కు సంబంధించిన మందులు వాడటం లేదని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గత మూడు రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ హాస్పిటల్‌కు వెళ్లలేదని చెప్పారు. ఆదివారం రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్న అందెశ్రీ.. ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి బాత్‌రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారు. ఆయన మరణించి దాదాపు ఐదు గంటలు అయి ఉండొచ్చని డాక్టర్ సింధూర అంచనా వేశారు. ఆరోగ్య విషయంలో ఆయన చూపిన నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందని వైద్యులు స్పష్టం చేశారు.అధికార లాంఛనాలతో అంత్యక్రియలుఅందెశ్రీ మృతిపట్ల రాష్ట్రంలో రాజకీయ, సాహిత్య ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అనేక ప్రముఖ నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరి పోసిన అందెశ్రీ గౌరవార్థం ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్షరం ముక్క రాని ప్రజాకవిచిన్నతనంలో గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన అందెశ్రీ.. తనలోని అపారమైన ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగారు. ఆయన రచించిన 'మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు', తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' ఆయనకు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేసింది. తెలంగాణ నేల గళాన్ని, ఉద్యమ స్ఫూర్తిని తన పాటల్లో నింపిన అందెశ్రీ లేని లోటు నిజంగా పూడ్చలేనిదే.