వైభవ్ ఓకే కానీ జితేశ్ ఏంటి పూనకం వచ్చినట్టు ఆడాడు, ఆ హిట్టింగ్ ఏంట్రా బాబూ.. ఆర్సీబీకి ఢోకా లేదు!

Wait 5 sec.

ఆసియా కప్ రైజింగ్ స్టార్ట్స్ 2025తో ఐసీసీ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. కేవలం సీనియర్స్‌కి మాత్రమే కాకుండా ప్రతి దేశం తరఫున ఉన్న ఏ టీమ్స్ కూడా ఎప్పుడూ ప్రాక్టీస్‌లో ఉండేందుకు ఇలాంటి టోర్నీలు ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగా ఆసియా ఖండంలోని ఏ జట్లతో కలిసి ఇటీవల జరిగిన ఆసియా కప్‌లా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ పేరుతో ఓ మెగా టోర్నీకి ఏర్పాటు చేసింది. ఖతార్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఉగ్ర రూపం చూపెట్టారు. యంగ్ ఓపెనర్ శివాలెత్తి బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు బౌండరీల మోత మోగించారు. జట్టు మొత్తం 297 పరుగులు చేస్తే ఈ ఇద్దరే 227 పరుగులు బాదారు. వైభవ్ సూర్యవంశీ అవుటైన తర్వాత ఇండియా ఏ కెప్టెన్ జితేశ్ శర్మ తన బ్యాట్‌కి పని చెప్పాడు. ఆఖరి ఏడు ఓవర్లలో బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చిక్కిన ప్రతి బంతినీ బౌండరీకి బాదుతూ తన సత్తా చాటాడు. 32 బంతులు ఆడిన జితేశ్ శర్మ 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆఖరి బంతి వరకూ క్రీజులోనే కొనసాగి నాటౌట్‌గా నిలిచాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో ఆఖరి మూడు మ్యాచ్‌లలో ప్లేస్ దక్కించుకున్న జితేశ్ శర్మ పెద్దగా రాణించలేకపోయాడు. దాంతో జట్టులో ఎలాగైనా ప్లేస్‌ను నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఇండియా ఏ తరఫున తన కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున ఆడిన జితేశ్.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆడి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో 144, ప్రియాన్షు ఆర్య 6 బంతుల్లో 10, నమన్ ధీర్ 23 బంతుల్లో 34, నేహాల్ వధేరా 9 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటవ్వగా.. జితేశ్ శర్మ 83, రమణ్‌దీప్ సింగ్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారీ స్కోర్ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 149/7 పరుగులకే పరిమితమైంది. గుర్‌జపనీత్ సింగ్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.