ఆంధ్రప్రదేశ్‌ను మొంథా తుఫాన్ వణికించింది.. అయితే మరోసారి అల్పపీడనం టెన్షన్ వెంటాడుతోంది. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 'నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రభావంతో ఈనెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు- భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో చలి వాతావరణంమరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. గురువారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులలో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా చలి పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరోవైపు పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల వంటి జిల్లాల్లో మాత్రం పగటిపూట వేడి కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రంలో ఒకేసారి చలి, వేడిగాలులు రెండూ ప్రభావం చూపుతున్నాయి. ఓ వైపు చలి వాతావరణంతో జనాలు అల్లాడిపోతుంటే.. తాజాగా వర్షాలు కురుస్తాయన్న వార్తలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ అల్పపీడనంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు.