ఓ రైతు పోలీసులకు రెండేళ్లుగా మస్కా కొడుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా రూ. కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. పుష్ప సినిమా చూసి ఏమైనా స్పూర్తి పొందాడేమో తెలీదు కాని.. అంతకుమించి చేస్తున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ రైతు తెలివి చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. పక్కా సమాచారంతో ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్, డీఆర్ఐ అధికారులు ఇతడితో సహా.. అంతర్రాష్ట్ర చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్ల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నా.. అతడు మొదటిసారి పోలీసులకు పట్టుబడ్డాడు. పుష్ప సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా..కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతానికి చెందిన రాహుల్‌ కుమార్‌ ఓ రైతు. తన గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే వ్యవసాయం అంత లాభదాయకం కాదని భావించిన రాహుల్.. ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. ఈ క్రమంలో గంజాయి స్మగ్లింగ్ గురించి ఆరా తీశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి గంజాయి స్మగ్లింగ్‌ను ఎంచుకున్నాడు. అనంతరం విజయవాడ, విశాఖపట్నంకు చెందిన కొందరు డ్రైవర్లతో కుమ్మక్కైయ్యాడు. గంజాయి స్మగ్లింగ్ కోసం ఐదు పెద్ద లారీలను కొన్నాడు రాహుల్ కుమార్. అందులో మూడు లారీలను తన పేరుపై రిజిస్టేషన్ చేయించుకుని.. మరో రెండింటిని విశాఖపట్నంకు చెందిన డ్రైవర్ ఆనంద్‌ కుమార్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఇందుకోసం ఆనంద్ కుమార్‌కు రూ. 10 వేలు ఇచ్చి ఒప్పించాడు. ఆ తర్వాత గంజాయిని.. ఎవరికీ అనుమానం రాకుండా సరిహద్దులు దాటించేవాడు. ఇలా గత రెండేళ్లుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. రూ. కోట్లలో సంపాదించాడు. ఈ వ్యవహారంపై తన సొంతూరితో సహా ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేశాడు. రైతు నుంచి గంజాయి స్మగ్లర్‌గా మారిన రాహుల్ కుమార్ వ్యవహారం బయటకు పొక్కి పోలీసుల దాకా చేరింది. ఈ మేరకు సమాచారంతో.. ఏపీ ఈగల్, డీఆర్‌ఐ టీమ్‌లు.. నవంబర్ 10న విజయవాడ శివారు ప్రాంతం కానూరులో ఉన్న నిందితుడి గోదాంపై దాడులు చేశాయి. 242 ప్యాకెట్లలో 248.82 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ కోసం ఉపయోగిస్తున్న ఐదు లారీలు, ఓ కారును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు శాయన రాహుల్‌ కుమార్‌తో పాటు.. గోదాం ఇంఛార్జి హుస్సేన్‌, హర్యానాకు చెందిన డ్రైవర్ సోహన్‌ లాల్‌, విశాఖకు చెందిన డ్రైవర్లు ఆనంద్‌ కుమార్‌, అబ్దుల్‌ హసన్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా గంజాయి స్మగ్లింగ్..గంజాయిని ఒరిస్సా నుంచి ఏపీలోని భవానీపట్నం.. ఇక్కడి నుంచి విజయవాడకు రవాణా చేసేవాడు రాహుల్. విజయవాడ సమీపంలోని కానూరు గోదాంలో నిల్వచేసేవాడు. ఇక్కడి నుంచి వేర్వేరు లారీల్లో ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయి తరలించేవాడు. రూ. 40 వేలు ఇచ్చేవాడు. ఇక పుష్ప సినిమాలో చూపించినట్లు.. ప్రతి లారీ కింది భాగంలో ప్రత్యేక అరలను ఏర్పాటు చేసి గంజాయి తరలించేవాడు. కానీ అనుమానం రాకుండా పైన కంకర పోసేవాడు. .. ఒరిస్సా నుంచి వచ్చే లారీలకు ఏపీ రిజిస్ట్రేషన్, ఉత్తరాదికి తరలించడానికి ఉత్తర్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను ఉపయోగించేవాడు. అప్పుడప్పుడూ డ్రైవర్లతో పాటు లారీలను మార్చేసేవాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.