దేశ రాజధాని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది ఉగ్రవాదుల చర్యేనని అధికారికంగా ధ్రువీకరించింది. బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఘటనను తీవ్రంగా ఖండించింది. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరును కొనసాగించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రకటన చేశారు. ఢిల్లీ కారు పేలుడును ఖండిస్తూ.. ఉగ్రదాడిగా తీర్మానం చేసినట్టు తెలిపారు. ‘‘దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశం ఎదుర్కొంది’’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.పేలుడు అనంతరం పరిణామాలు, దర్యాప్తు తీరుపై మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమీక్షించింది. సమీక్ష సమావేశం ముగిసిన కొద్దిసేపటికే క్యాబినెట్ భేటీ అయ్యింది. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర క్యాబినెట్ ఈ దారుణమైన, పిరికిపంద చర్యను నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానిని పూర్తిగా నిర్మూలించాలనే భారత అచంచల నిబద్ధతను మళ్లీ పునరుద్ఘాటిస్తోంది’’ అని తెలిపారు.‘‘ఈ క్రూరమైన పిరికిపంద చర్య అమాయకుల ప్రాణాలను బలిగొంది. మంత్రివర్గం దానిని తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పూర్తిగా అంతం చేయాలనే విధానం కొనసాగించాలన్న భారతదేశ అచంచల సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోంది. దాడిని ఖండిస్తూ అనేక దేశాలు తెలిపిన సంఘీభావం, మద్దతుకు క్యాబినెట్ కృతజ్ఞతలు తెలుపుతోంది’’ అని అన్నారు.కాగా, అంతకు ముందు భూటాన్ పర్యటన ముగించుకుని ఇండియాకు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీ.. నేరుగా క్షతగాత్రులతో మాట్లాడిన ప్రధాని.. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వైద్యులు, అధికారులు వివరించారు.