స్కూల్‌కు 10 నిమిషాలు ఆలస్యం.. బాలిక ప్రాణాలు తీసిన టీచర్ పనిష్మెంట్.. చిల్డ్రెన్స్ డే రోజే

Wait 5 sec.

ఉపాధ్యాయులు అంటే పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసే వారు. కానీ ఇలా చిరుప్రాయంలోనే అభం శుభం ఎరుగని చిన్నారుల పాలిట యమకింకరులు అవుతారని ఎవరూ ఊహించిఉండరు. ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని వాసాయిలో జరిగింది.చిల్డ్రెన్స్ డే రోజే ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. వారం రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసాయి (ఇ)లోని శ్రీ హనుమంత విద్యా మందిర్‌లో కాజల్ గౌడ్ అనే 13 ఏళ్ల బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో నవంబర్ 8న పాఠశాలకు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన క్లాస్ టీచర్.. కాజల్‌కు పనిష్మెంట్ ఇచ్చింది. స్కూల్ బ్యాగు వీపుపై ఉండగానే 100 గుంజీళ్లు తీయాలని బలవంతం చేసింది. టీచర్‌కు అడ్డుచెప్పలేని బాలిక.. తనతో పాటు ఆలస్యంగా వచ్చిన వారితో కలిసి స్కూల్ బ్యాగ్‌తోనే 100 గుంజీళ్లు తీసింది. అయితే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కాజల్ ఆరోగ్యం క్షీణించింది. మెడ నుంచి కింద భాగం నొప్పిగా ఉందని, కదళ్లేకపోతున్నానని తనతో చెప్పినట్లు ఆమె తల్లి తెలిపింది. చిల్డ్రెన్స్ డే రోజే బాలిక మృతి.. తల్లిదండ్రులు బాలికను వెంటనే వాసాయిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను జేజే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలల దినోత్సవం నాడు (నవంబర్ 14) 11 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది బాలిక. తమ కుమార్తె మృతి చెందడానికి టీచర్, పాఠశాల కారణమని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. వాలివ్ పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ విషయం గురించిన తెలిసిన స్థానిక ఎంఎన్ఎస్ కార్యకర్తలు పాఠశాలకు తాళం వేశారు. అందులో ఓ కార్యకర్త సచిన్.. బాలికకు ఆస్తమా/ శ్వాస సమస్యలు ఉన్నాయని తెలిపారు. అందులో టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ తట్టుకోలేకపోయిందని చెప్పాడు. కాగా, బాలిక మృతిపై స్పందించిన పాఠశాల అధికారి వికాస్ యాదవ్.. పనిష్మెంట్ కారణంగానే బాలిక మృతి చెందిందని తేలితే.. తప్పును అంగీకరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ గలాంగే స్పందించారు. ఈ ఘటనపై తాము అన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. శ్రీ హనుమంత విద్యా మందిర్‌ పాఠశాలకు 8వ తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించడానికి అనుమతి ఉందని.. కానీ 9, 10 తరగతుల్లో కూడా విద్యార్థులను చేర్చుకున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ఇలా చేయడం చట్టవిరుద్ధమని.. దీనిపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి గలాంగే తెలిపారు.