నకిలీ పత్రాలను సృష్టించి సుమారు రూ. 27 కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించడానికి ప్రయత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మలూరులోని ఫ్యూచర్‌సిటీ ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 247/5లోని 9.04 ఎకరాల భూమిని రామిడి యాదవ లక్ష్మీకాంత్‌ రెడ్డి అనే వ్యక్తి 2002లో కొనుగోలు చేశారు. ఈ భూమిని కాజేయాలని పథకం వేసిన నకిలీ పత్రాల ముఠా.. లక్ష్మీకాంత్‌రెడ్డికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మార్చి, అత్యంత పకడ్బందీగా సృష్టించింది. ఆ తర్వాత ఆ భూమిని వేరే వ్యక్తులకు విక్రయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ క్రమంలోనే, అసలు పట్టాదారు యాదవలక్ష్మీకాంత్‌రెడ్డి అన్న అయిన రమాకాంత్‌ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించగా ఈ అక్రమం బయటపడింది. పాస్‌పుస్తకంలోని ఆధార్ నంబర్‌కు, అసలు పట్టాదారుడికి ఎటువంటి సంబంధం లేకపోవడంపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా ఈ ముఠాకు చెందిన ఆరుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ధన్నారంకు చెందిన శ్రీకాంత్‌గౌడ్ , తుర్కయాంజాల్‌కు చెందిన కిషన్, మాడ్గుల మండలం సుద్దపల్లికి చెందిన దవలయ్య అలియాస్ శ్రీను, ఆమనగల్లుకు చెందిన మహేశ్, నాగర్‌కర్నూల్ జిల్లా ఊరకొండకు చెందిన మాధవులు, ఇంజాపూర్‌కు చెందిన రాఘవాచారిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో వీరు నకిలీ పత్రాల తయారీలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారని తేలింది. వీరు కేవలం ఆధార్ వివరాలను మాత్రమే కాకుండా, రెవెన్యూ రికార్డులను పోలిన విధంగా పాసుపుస్తకాలను సృష్టించి, అమాయకులను మోసం చేయడానికి సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు. వీరు వేరే ప్రాంతాల్లో కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాలో కీలక పాత్ర పోషించిన మరో ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. భూ దస్త్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పత్రాల విషయంలో అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ ప్రజలకు సూచించారు.