చరిత్రలో జమ్ము కశ్మీర్ జట్టుకు ఇది మరచిపోలేని రోజు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా జమ్ము కశ్మీర్ చరిత్ర సృష్టించింది. 65 ఏళ్ల తర్వాత దేశీయ క్రికెట్ దిగ్గజం ఢిల్లీని తొలిసారిగా ఓడించింది. ఈ విజయంతో ఎలైట్ గ్రూప్‌ – డీలో జమ్మూ కశ్మీర్ రెండో స్థానానికి చేరింది. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ అద్భుతమైన శతకంతో జమ్ము కశ్మీర్‌ను విజయపథంలో నడిపించాడు. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ ఇక్బాల్ 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. క్రీజులో నిల్చొని ఢిల్లీ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని జట్టుకు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఇక్బాల్ ఈ ఇన్నింగ్స్‌తో జమ్ము కశ్మీర్ టాప్ ఆర్డర్‌లో నమ్మకమైన బ్యాటర్‌గా తన స్థానాన్ని మరింత బలపరిచాడు. ఈ విజయంతో రానున్న మ్యాచ్‌లలో జమ్ము కశ్మీర్ జట్టు తన సత్తా ఏంటో నిరూపించే అవకాశం ఉంది.మ్యాచ్‌లో ప్రారంభం నుంచే జమ్మూ బౌలర్లు ఆధిపత్యం చాటారు. ఆక్బిబ్ నబీ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు (5/35) తీయడంతో ఢిల్లీ 211 పరుగులకే పరిమితం అయింది. రెండో ఇన్నింగ్స్‌లో వన్షజ్ శర్మ 6 వికెట్లు (6/68) తీసి ఢిల్లీకి ఏ అవకాశం ఇవ్వలేదు. వీరి సమష్టి బౌలింగ్‌తో పాటు బెస్ట్ ఫీల్డింగ్ జమ్ము కశ్మీర్‌‌కు మ్యాచ్ తమ చేతులోనే ఉండేలా చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో జమ్ము కశ్మీర్ కెప్టెన్ పరాస్ దోగ్రా 106 పరుగులు, అబ్దుల్ సమద్ 85 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం జట్టుకు 310 పరుగుల బలమైన స్కోరును అందించింది. ఆ ఇన్నింగ్స్ నుంచే ఢిల్లీ వెనుకబడింది. దోగ్రా కెప్టెన్సీ నిర్ణయాత్మకంగా మారింది. సరైన సమయంలో వన్షజ్ శర్మను బౌలింగ్‌లోకి తీసుకురావడం వంటి వ్యూహాత్మక మార్పులు ఢిల్లీని కంగారు పెట్టాయి. మ్యాచ్ మొత్తంలో దోగ్రా చురుకైన ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు, సమయోచిత నిర్ణయాలే జమ్ము కశ్మీర్ విజయంలో కీలకంగా మారాయి.