రాయలసీమకు గుడ్‌న్యూస్.. కర్నూలు దశ తిరిగినట్టే.. నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల

Wait 5 sec.

రాయలసీమవాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. దిశగా అడుగులు పడుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై చర్చించడానికి ఆయన కలెక్టర్‌ సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, డీఆర్వో వెంకట నారాయణమ్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఏర్పాటుకు ప్రభుత్వం ఎంతో ఆసక్తితో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని మంత్రి టీజీ భరత్‌ అధికారులకు సూచించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ, అగ్రగామిగా నిలుపుతామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇటీవల నగరంలో రూ.12.62 కోట్లతో జరుగుతున్న 62 అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్ల వారీగా సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రగతిలో ముఖ్య స్థానాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సుముఖంగా ఉందని.. దీన్ని నగర శివార్లలో కాకుండా బి, సి క్యాంపుల్లో ఏర్పాటు చేసే అంశంపై ఇటీవల విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సైతం దీనిపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. 160 ఎకరాలకు పైగా భూమి ఉందని, ఎకరా 100 కోట్ల వరకు విలువ ఉందని, దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. వాటిలోనే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు వద్ద ఉన్న షాపుల అంశం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు నడుచుకుంటామని తెలిపారు. అనంతరం రహదారుల విస్తరణ, పారిశుద్ధ్యం, టిడ్కో గృహాలు, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి తదితర అంశాలపై నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనకు వచ్చిన సమయంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. స్థలాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.