మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో రూ.10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని.. విడుదల చేయాలని నిర్ణయించుకుంది! అయితే విడుదలకు ముందే లక్నో సూపర్ జెయింట్స్‌ షమీని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోందట. దీంతో ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి.. లక్నో సూపర్ జెయింట్స్ షమీని తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మహమ్మద్ షమీని ఇతర జట్లతో పోటీ పడీ మరి తీసుకుంది. రూ.10 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. అయితే గత సీజన్‌లో అతడు దారుణ ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో జట్టుకు బలంగా మారాల్సింది పోయి.. భారంగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని వదిలించుకోవాలని సన్ రైజర్స్ డిసైడ్ అయింది. ఐపీఎల్ 2026 రిటెన్షన్‌ గడువు నవంబర్ 15తో ముగియనుంది. అయితే అనుభవజ్ఞుడైన షమీని కొనేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు నడుస్తున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఐపీఎల్ 19వ సీజన్‌ కోసం రిటైన్, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు చెప్పేందుకు ఫ్రాంఛైజీలకు నవంబర్ 15 చివరి గడువు. శనివారం సాయంత్రం 3 గంటల లోపే అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు.. ఐపీఎల్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇక ఇదే సమయంలో పలు ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను ట్రేడింగ్‌లో దక్కించుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ.. శార్దుల్ ఠాకూర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్‌లను లక్నో సూపర్‌ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ నుంచి సొంతం చేసుకుంది.