Team Indiaకి ఊహించని షాక్.. ఈడెన్ గార్డెన్స్ టెస్టు మధ్యలోనే గిల్ రిటైర్డ్ హర్ట్, ఆ పెయిన్‌తోనే పెవిలియన్‌కు!

Wait 5 sec.

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం ప్రారంభమైన రెండో రోజు ఉదయం సెషన్‌లో టీమిండియా శుభమన్‌ గిల్ తీవ్ర నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సైమన్ హార్మర్ వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన గిల్, రెండో బంతిని స్లాగ్ స్వీప్ చేసినప్పటి నుంచే మెడ వెనుక భాగంలో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. బంతి బౌండరీకి వెళ్లినా, గిల్ వెంటనే అసౌకర్యంతో నిలబడ్డాడు. దీంతో టీమ్ ఫిజియో వెంటనే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి గిల్‌ను పరిశీలించాడు.మొదటి బంతిని డిఫెండ్ చేసిన గిల్, తరువాత వచ్చిన బంతిని అద్భుతంగా మిడిల్ చేసి బౌండరీకి పంపినా ఆ షాట్ తరువాతే అతను మెడను సరిగ్గా కదలించలేని స్థితిలో ఉన్నట్లు కనిపించింది. ఫిజియో చేసిన త్వరిత పరీక్ష అనంతరం గిల్ మైదానాన్ని వదిలి, రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కి నడుచుకుంటూ వెళ్లాడు. దాంతో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.టెస్ట్ జట్టుకు నాయకత్వం చేపట్టినప్పటి నుంచి గిల్‌పై ఉన్న వర్క్‌లోడ్‌ గురించి చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌తో ఆడిన అయిదు మ్యాచ్‌ల ఆండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ అనంతరం గిల్ ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా వరుసగా క్రికెట్ ఆడుతున్నాడు. ఆ తరువాత జరిగిన ఆసియా కప్, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడి రెస్ట్ లేకుండా ఉన్నాడు. విశ్రాంతి లేని కారణంగా గిల్ ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో సఫారీలను కుప్పకూల్చగా.. సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. తొలి రోజే మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా కూడా ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది.37/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు కూడా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేసి అవుటవ్వగా.. ఆ వెంటనే గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రిషబ్ పంత్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించి 24 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ను దాటేసిన భారత్ ప్రస్తుతం లీడింగ్‌లో కొనసాగుతోంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన అనధికారిక టెస్టులో వరుస సెంచరీలతో రాణించిన ధ్రువ్ జురేల్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 53 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 11 పరుగుల ఆధిక్యంతో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కొనసాగుతున్నారు.