ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో అంతర్జాతీయ విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ - విజయవాడ మధ్యనేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఇండిగో విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభమైంది. ఈ సర్వీసు గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి.. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుల సమక్షంలో ప్రారంభమైంది.ఈ విమాన సర్వీస్ వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) అందుబాటులో ఉంటుంది. ఇవాళ విమాన సర్వీస్ ప్రారంభంకావడంతో.. ఏపీ సీఎం చంద్రబాబుకి, మంత్రి లోకేష్‌కి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ విమానం సింగపూర్ నుంచి బయల్దేరి ఉదయం 7.45 గంటలకుకు చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో ఉదయం 10.05 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్‌ చాంగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ విమానం ప్రయాణం కేవలం 4 గంటలు మాత్రమే. ఇండిగో 180 నుంచి 230 సీట్లు ఉన్న బోయింగ్ విమానాలను నడపాలని నిర్ణయించారు. మొదటి వారానికి మూడు రోజులు నడిపి.. డిమాండ్ పెరిగితే రోజువారీ కూడా నడుపుతామంటున్నారు. అయితే ఇండిగో సంస్థ 2018 డిసెంబర్‌ నుంచి 2019 జూన్‌ వరకు విజయవాడ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు నడిపిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసుల్లో అప్పట్లలో 80శాతం నుంచి 90శాతం వరకు ఆక్కుపెన్సీ నమోదైందట. ఈసారి కూడా డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ విమాన సర్వీసుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ పోర్టల్స్‌ చాలా రోజల క్రితమే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభంలో రూ. 8 వేల ధరతో ఆఫర్‌ ఇవ్వడంతో బుకింగ్స్‌ పెరిగాయి. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో పండగలు ఉండటంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిన్నటి వరకు ఏపీ ప్రజలు సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేది. ఇలా ప్రయాణం చేయాలంటే ఎక్కువ సమయం పట్టడంతో పాటుగా డబ్బులు కూడా ఖర్చు. ఇప్పుడు విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సర్వీసులు నడుపుతుండటంతో ప్రజలకు ఆ తిప్పలు లేకుండా పోయాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు నడిపే అవకాశం ఉందంటున్నారు.