: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతనాలు, అలవెన్స్‌లు, పెన్షన్‌లను సమీక్షించేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల ప్రయోజనాలు ఈ వేతన సంఘం పరిధి నుంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాదనలు పెరుగుతున్న క్రమంలో ఉద్యోగుల తరఫున అత్యున్నత వేదిక అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) స్టాఫ్ సైడ్ అత్యవసర అంతర్గత సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలోని ముఖ్యమైన ఎజెండా ఏంటి అనేది బహిర్గతం చేయకపోయినా ఈ విషయంపైనే ముఖ్యంగా చర్చించారనే వాదనలూ వినిపిస్తున్నాయి. అనేక కీలక అంశాలను తొలగించడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది. దీనిపై అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య (AIDEF) స్పందించింది. టీఓఆర్‌లో పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల పెన్షన్ పునరుద్ధరణ గురించి నిర్దిష్టంగా ఎక్కడా ప్రస్తావన లేకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. దశాబ్దాలుగా ఉన్న ఆనవాయితీకి విరుద్ధంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న పదవీ విరమణ పొందిన వారిని వేతన సంఘం పరిధి నుంచి మినహాయించడం అన్యాయమని, సరైన నిర్ణయం కాదని లేఖలో పేర్కొంది. పెన్షనర్ల అంశంతో పాటు, 8వ వేతన సంఘం టీఓఆర్‌లో కనిపించని మరో కీలక అంశం - అమలు తేదీ. సాధారణంగా వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమలవుతాయో గతంలోనే స్పష్టంగా పేర్కొనేవారు. ఉదాహరణకు 7వ వేతన సంఘం టీఓఆర్ లో 2016 జనవరి 1 నుంచి అమలు తేదీని స్పష్టంగా నిర్దేశించారు. అయితే, ప్రస్తుత టీఓఆర్‌ లో ఆ ప్రస్తావన లేకపోవడంతో సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయనే దానిపై ఉద్యోగులలో అనిశ్చితి నెలకొంది. సూచనలు టీఓఆర్ ద్వారా కనిపిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు అంశాలు వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియపై అనుమానాలు పెంచుతున్నాయని పేర్కొంటున్నాయి. ఉద్యోగుల సమావేశం ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వ టీఓఆర్ పై ఒక ఐక్య వ్యూహాన్ని, ఏకీకృత ప్రతిస్పందనను సిద్ధం చేయడమని సమాచారం. ప్రభుత్వ అధికారిక వర్గంతో చర్చలకు వెళ్లే ముందు, పెన్షనర్ల ప్రయోజనాలను చేర్చడం, అమలు తేదీపై స్పష్టత, ఇతర పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఒక పటిష్టమైన వైఖరిని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.