కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు విజయం సాధించింది. స్నిన్నర్లకు అనుకూలించిన పిచ్ మీద భారత బ్యాటర్లు సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో . గత 15 ఏళ్లలో భారత గడ్డ మీద టెస్టు మ్యాచ్ గెలవడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో 8 వికెట్లు తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్ సిమాన్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే దక్షిణాఫ్రికాను గెలిపించింది మాత్రం కెప్టెన్ బవూమానే అనడంలో అతిశయోక్తి లేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచిన బవూమా.. కెప్టెన్సీలో తనదైన మార్క్ చూపించాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో.. బుమ్రా బౌలింగ్‌లో బవూమా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతడి ప్యాడ్లకు తాకింది. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసిన భారత ఆటగాళ్లు అంపైర్ ఔటివ్వకపోవడంతో రివ్యూ కోరదామని భావించారు. బవూమా పొట్టోడు అయినప్పటికీ.. బంతి వికెట్ల కంటే ఎత్తులో వెళ్తుందని పంత్ చెప్పాడు. ఆ తర్వాత భారత్ రివ్యూ కోరలేదు. కానీ బవూమాను.. మరుగుజ్జు అంటూ బుమ్రా వ్యాఖ్యానించడం.. ఒక క్రికెటర్‌ను అవమానించడమే అని భారత క్రికెట్ అభిమానులే చెబుతున్నారు.ఎప్పుడైతే బవూమాను బుమ్రా మరుగుజ్జు అని సంబోధించాడో.. అప్పుడే భారత్ మ్యాచ్‌లో ఓడిందని కొందరు అభిమానులు చెబుతున్నారు. బుమ్రా మాటలు బాధించాయేమో తెలీదు కానీ.. బవూమా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో సత్తా చాటాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా సరే.. మరో ఎండ్‌లో పాతుకుపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ కెప్టెన్.. 55 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఓ దశలో 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిపోతుందనుకున్న సౌతాఫ్రికా చివరకు 153 పరుగులు చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తోన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం సవాలే, అయితే అసాధ్యం మాత్రం కాదని బవూమా నిరూపించాడు. అంతే కాదు కెప్టెన్‌గా వ్యూహాత్మకంగా వ్యవహరించిన బవూమా.. బౌలర్లను తెలివిగా ఉపయోగించుకున్నాడు.చివర్లో అక్షర్ పటేల్ ఎదురు దాడికి దిగుతున్నప్పుడు.. భారత ఆటగాళ్ల మనస్తత్వాన్ని చదివేసిన బవూమా.. అక్షర్ తప్పు చేస్తాడని పసిగట్టాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఓ ఫోర్, రెండు సిక్సులు బాదిన అక్షర్ పటేల్.. మరో భారీ షాట్‌ ఆడటం కోసం బంతిని గాల్లోకి లేపాడు. వెంటనే అప్రమత్తమైన బవూమా.. మిడ్ వికెట్ నుంచి వేగంగా వెనక్కి పరిగెత్తుతూ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. మరుసటి బంతికే సిరాజ్‌ కావడంతో.. సౌతాఫ్రికా జట్టు గెలుపు సంబరాలు చేసుకుంది.భారత బ్యాటర్లు సిరాజ్, బుమ్రా మైదానాన్ని వీడుతున్నప్పుడు.. బుమ్రా వెళ్లి బవూమాను ఆత్మీయంగా పట్టుకొని మాట్లాడాడు. దీంతో మరుగుజ్జు వివాదానికి తెరపడినట్లయ్యింది.మ్యాచ్ అనంతరం బవూమా మాట్లాడుతూ.. కోల్‌కతా టెస్టులో విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కష్టమని మాకు తెలుసు. అయితే మా వంతుగా వీలైనంత సేపు క్రీజ్‌లో నిలబడటానికి ప్రయత్నించాం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాము. మా కుర్రాళ్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. మా బౌలర్లు తిరిగి మమ్మల్ని ఆటలోకి తీసుకొచ్చారు’’ అని బవూమా తెలిపాడు.రెండో ఇన్నింగ్స్‌లో కొద్ది కొద్దిగా భాగస్వామ్యాలు నిర్మించామని చెప్పిన బవూమా.. తన బ్యాటింగ్ టెక్నిక్‌తో తాను సౌకర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ట్రిగ్గరింగ్ గురించి తానేమీ ఆందోళన చెందడం లేదని.. ఆట గురించి తనకు మంచి అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు. తాను బాగా ఆడే ఉద్దేశంతోనే భారత్ వచ్చానన్న బవూమా.. ఇక్కడ తనకు గొప్ప రికార్డు లేదని.. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం, చిన్న చిన్న విషయాలను అమలు చేయడం లాంటి చేస్తున్నానని చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన కాలును కొద్దిగా ఓపెన్ చేసిన ఆడటం లాంటి సర్దుబాట్లు చేసుకున్నానని బవూమా తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్ టెస్టులో రబాడ ఆడకపోయినప్పటికీ.. తమ జట్టులో సైమన్, కేశవ్ మహారాజ్ ఉన్నారని.. వారిద్దరి వల్ల తమ బౌలింగ్ విభాగం బలంగా ఉందన్నాడు. అక్షర్ పటేల్ ఇచ్చిన క్యాచ్ పట్టడం అంత సులభం కాదన్న బవూమా.. దాన్ని పట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. అదో కీలకమైన క్షణం అన్న సఫారీ కెప్టెన్.. మూమెంటమ్ ఉన్నప్పుడు భారత బ్యాటర్లు ఎలా ఆడతారో తమకు తెలుసని.. దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడుతున్న్పడు.. వారు మరింత దూకుడుగా ఆడాలని చూస్తారన్నాడు. ‘లక్కీగా అక్షర్ పటేల్ తప్పు చేశాడు.. నా చిన్న చేతులతో బంతిని ఒడిసిపట్టుకున్నాను. ఇలాంటి క్షణాలను మీరు వేరే ఎవరికీ ఇవ్వాలని కోరుకోరు. జట్టు కోసం ఇలాంటి క్యాచ్‌లు పట్టాలని ఎవరైనా అనుకుంటారు’ అని బవూమా వ్యాఖ్యానించాడు.ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు మాట తూలి.. మ్యాచ్‌ను కోల్పోతే.. సౌతాఫ్రికా కెప్టెన్ బవూమా మాత్రం.. తన బ్యాట్‌తో, తన నాయకత్వ ప్రతిభతో ఓడిపోయే మ్యాచ్‌లో తన జట్టును గెలిపించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సాధించిన తమ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతున్నప్పుడు భారత ఆటగాళ్లు.. నోటికి పని చెప్పకుండా.. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడాలని బవూమా చెప్పకనే చెప్పాడు.