IAS A Sharath: కొన్ని నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం రేవంత్.. స్టేజీ దిగిపోయే సమయంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మారింది. ఇక దీనికి సంబంధించిన వీడియోలు.. మీడియా, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్.. పదవీ విరమణ పొందారు. అయితే సీఎం కాళ్లు మొక్కిన 3 నెలలకే.. ఆ విశ్రాంత ఐఏఎస్ అధికారికి.. పదవి దక్కడం ఇప్పుడు మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది.తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్) ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్‌ను నియమిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో సీఎస్ వెల్లడించారు. 2 ఏళ్ల పాటు ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్‌ కొనసాగనున్నారు. పదవీ విరమణకు ముందు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్.. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేశారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట సందర్భంగా ఆయన కాళ్లను ఐఏఎస్ శరత్ మొక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను తెచ్చిన బహుమతిని ముఖ్యమంత్రికి అందించిన ఐఏఎస్ శరత్.. ఒక వైపు ఫోటోలు దిగుతుండగానే సీఎం కాళ్లకు నమస్కరించడం వీడియోలు, ఫోటోల్లో రికార్డ్ అయింది. అయితే ఐఏఎస్ శరత్ తన కాళ్లను మొక్కడాన్ని గమనించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్టేజీ దిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. అయితే అంతకుముందు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కాళ్లను కూడా పలువురు ఐఏఎస్ అధికారులు మొక్కడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తీవ్ర విమర్శలకు దారితీయడంతో సీఎస్ కే రామకృష్ణారావు స్పందించారు. ఇలాంటి అధికారులు చేసే అనుచిత ప్రవర్తనతో ప్రజల్లో ఐఏఎస్‌లపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు.. తమ పదవి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని వెల్లడించారు. ఎవరైనా 1968 ఐఏఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఎవరిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు.