తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వానలు

Wait 5 sec.

తెలంగాణలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ఈ జిల్లాల్లో 20 సెం.మీ.లకు మించి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐదు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌లకు రెడ్ అలర్ట్ ప్రకటించగా.. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, ఆదిలాబాద్‌తో సహా తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే ఉత్తమమని చెప్పారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కురిశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ములుగు జిల్లాలోని గోవిందరావుపేటలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 17.3 సెం.మీ., మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కేవలం గంటన్నర వ్యవధిలోనే 12.5 సెం.మీ. వర్షపాతం రికార్డైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆదిలాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో వరదలో చిక్కుకున్న ప్రజలను ఈ బృందాలు కాపాడాయి.