అమెరికా-భారత్ వాణిజ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేసిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకోవడంపై మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మొదట 25 శాతం.. ఆ తర్వాత మరో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. ఇందులో ఇప్పటికే 25 శాతం సుంకాలు అమల్లోకి రాగా.. ఈనెల 27వ తేదీ నుంచి మిగిలిన 25 శాతం టారిఫ్‌లు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పుతిన్‌తో అలాస్కాలో భేటీకి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తమకు ప్రధాన చమురు కొనుగోలుదారుగా ఉన్న కస్టమర్ అయిన భారత్‌ను.. ఇప్పుడు రష్యా కోల్పోయిందని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో భారత్‌పై రెండో విడతలో విధించనున్న సుంకాలను విధించాల్సిన అవసరం రాకపోవచ్చని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ చేసిన ప్రకటనకు భిన్నంగా.. భారత ప్రభుత్వ రంగ ఆయిల్ రిఫైనరీ సంస్థలు.. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసినట్లు బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే తాము తమ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నామని.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేయలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ ఛైర్మన్ ఎ.ఎస్. సాహ్నీ పేర్కొన్నారు.2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత.. పశ్చిమ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను రద్దు చేసుకున్నాయి. అయితే అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న భారత్.. తక్కువ ధరకే రష్యా నుంచి చమురును భారీగా కొనుగోలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 2022లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. రష్యా నుంచి చేస్తున్న చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తే.. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవాలని భారత్ ప్రణాళికలు చేస్తోంది.అయితే ట్రంప్ చేసిన ప్రకటనపై భారత్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. చమురు దిగుమతుల విషయంలో అమెరికా తీసుకువస్తున్న ఒత్తిడిని ఏ మాత్రం పట్టించుకోని భారత్.. వెనక్కి తగ్గలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి భారత చమురు సంస్థలు.. రషా చమురును స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేయగా రిలయన్స్, నయారా ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం.. తాము చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల మేరకు కొనుగోళ్లను జరుపుతున్నట్లు తెలుస్తోంది.