: నేషనల్ హైవేలు, నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించే వానహదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాణిజ్యేతర వాహనాలు (వ్యక్తిగత వాహనాలకు మాత్రమే) ఈ పాస్ ఇస్తారు. ఏడాది పాటు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ వార్షిక పాస్‌కు వాహనదారుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ పాస్ తీసుకునేందుకు ఎగబడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఈ పాస్ అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రోజునే ఏకంగా 1.40 లక్షల మంది వాహనదారులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 1150కి పైగా ఉన్న నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ దారులపై ఉన్న టోల్ గేట్లలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ వార్షిక పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. అదే రోజు సాయంత్రం 7 గంటల వరకే ఏకంగా 1.40 లక్షల మంది వాహనదారులు ఈ వార్షిక పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఒకేసారి 20 నుంచి 25 వేల మంది వాహనదారులు వార్షిక పాస్ యాక్టివేషన్ కోసం లాగిన్ అవుతున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపింది. ఆయా వాహనాలు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు వస్తే దాని ప్రకారం జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. వాణిజ్య వాహనాలకు ఈ వార్షిక పాస్ వర్తించదు. 200 ట్రిప్పులు తొందరగా పూర్తయితే మళ్లీ రూ. 3 వేలు పెట్టి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా ఏడాదిలో ఎన్నిసార్లైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్ కొనుగోలు చేసిన వారు మళ్లీ కొత్తగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత ఫాస్టాగ్ ద్వారానే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ (NHAI), morth అధికారిక వెబ్‌సైట్లలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ లింకులు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా రూ.3000 చెల్లించి ఈ వార్షిక పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆగస్టు 15 నుంచే ఈ కొత్త పద్ధతి అమలులోకి తీసుకొచ్చారు. ఫాస్టాగ్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వార్షిక పాస్ ద్వారా ఏడాదికి సుమారు రూ.7 వేల వరకు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.