తెలంగాణలో మరో అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కసరత్తు చేస్తోంది. రాబోయే రెండేళ్లలో ఈ రెండు విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రూ. 205 కోట్లు విడుదల చేసింది. భూసేకరణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా చిన్న విమానాలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ఏఏఐ భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పెద్ద విమానాలు (A320, B737), కార్గో విమానాల రాకపోకలకు అనుగుణంగా దీనిని నేరుగా అభివృద్ధి చేయాలని ఏఏఐ నిర్ణయించినట్లు సమాచారం.ఇక ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి భారత వాయుసేన అనుమతి తెలిపింది. ఇక్కడ ఇప్పటికే వాయుసేనకు సంబంధించిన 362 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. స్థానిక పరిస్థితులను బట్టి 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు, రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే వాటికి పూర్తిస్థాయి అనుమతులు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే తెలంగాణలో గగనతల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. కేంద్ర విమానయానశాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో ప్రస్తుతానికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.