ఆంధ్రప్రదేశ్‌లోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగనుంది.. ఈ మేరకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాచిగూడ (హైదరాబాద్) నుంచి యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) మధ్య నడిచే వందేభారత్‌ రైలు ఇకపై శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కూడా ఆగనుంది. ఈ మేరకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఈ నిలిపేందుకు రైల్వే అధికారులు అంగీకరించినట్లు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్‌ రైలు హిందూపురంలో ఆపాలని ఎప్పటి నుంచి ప్రయాణికులు కోరుతున్నారని.. వారి కోరిక మేరకు ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన వినతిని పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు.. హిందూపురం రైల్వే‌స్టేషన్‌లో ఆపేందుకు అంగీకరించారని తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అనేది త్వరలో క్లారిటీ వస్తుందన్నారు.హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపారు. 'కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ గారిని పలుమార్లు కలిసి కాచిగూడ నుంచి యశ్వంతపూర్ మధ్య నడిచే వందే భారత్ రైలు హిందూపురంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆపాలని విన్నవించగా రైల్వే అధికారులు స్పందించి రైలు నిలుపుదలకు అంగీకరించారు ఎప్పటినుంచి స్టేషన్లో అందుబాటులోకి వస్తుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు' అంటూ పోస్ట్ పెట్టారు. అయితే ఆయన రైల్వే అధికారులు అనుమతించిన ఆర్డర్ కాపీని కూడా పోస్ట్ చేశారు. అయితే రైల్వే అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో.. హిందూపురం రైల్వే స్టేషన్‌లో కొద్దిరోజుల పాటూ ప్రయోగాత్మకంగా రైలును ఆపాలని ఆదేశించారు.. త్వరలోనే అక్కడ రైలును ఎప్పటి నుంచి ఆపుతారో క్లారిటీ ఇస్తారన్నారు. హిందూపురం రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజూ టికెట్ల అమ్మకాలను పరిశీలించాలని.. బాగా ప్రచారం చేయాలని.. ఆ తర్వాత కన్ఫం చేయాలని పేర్కొన్నారు. మొత్తానికి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హిందూపురం రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగనుంది. హిందూపురంలో ఈ రైలు ఆగితే బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ కాచిగూడ-యశ్వంత్‌పుర్ రైలు (20703, 20704)ను వర్చువల్‌గా ప్రారంభించారు. జులై 10 నుంచి ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తున్నాయి.. ఇప్పుడు వాటికి అదనంగా బోగీలను జత చేస్తున్నారు. దీంతో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఈ వందేభారత్ రైళ్లు 14 చైర్‌కార్ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. కోచ్‌ల సంఖ్య పెరగడంతో ప్రయాణికుల సీట్ల సామర్థ్యం కూడా పెరుగుతుంది. గతంలో 530 సీట్లు ఉండగా, ఇప్పుడు 1128 సీట్లు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణికులు వందే భారత్ రైళ్లలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.