ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ అయిన ట్రంప్.. ఇక జెలెన్‌స్కీతో మరోసారి ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పుతిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన తర్వాత పుతిన్.. ఈ ఫోన్ చేయడం గమనార్హం. ఈ ఫోన్ కాల్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి.. దాన్ని ఆపేందుకు శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం గురించి వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతీకారంగా ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో.. పుతిన్‌తో ఫోన్ కాల్‌ వ్యవహారానికి సంబంధించి.. ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. తన ఫ్రెండ్ పుతిన్‌కు థ్యాంక్స్ చెప్పారు. పుతిన్ ఫోన్ చేసినందుకు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి విషయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో రష్యాకు తలెత్తిన సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని ఎల్లప్పుడూ భారత్ కోరుకుంటోందని.. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇక మోదీ-పుతిన్ ఫోన్ కాల్‌కు సంబంధించి.. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరిని ప్రధాని మోదీ.. పుతిన్‌కు మరోసారి స్పష్టం చేశారని పేర్కొంది. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని.. ఆ దిశగా జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ చెప్పినట్లు వెల్లడించింది.శనివారం (ఆగస్ట్ 16వ తేదీ)న అమెరికాలోని అలాస్కాలో.. డొనాల్డ్ ట్రంప్‌, భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత మాట్లాడిన పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని న్యాయమైన పద్ధతిలో ముగించడానికి ఉన్న మార్గాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ సమావేశం సరైన సమయంలో చాలా ఉపయోగకరంగా జరిగిందని చెప్పారు. చాలా కాలం తర్వాత ఇలాంటి ప్రత్యక్ష చర్చలు జరిగాయని పుతిన్ తెలిపారు. ఇక మోదీకి పుతిన్ ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత.. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. ఈ భేటీలో జెలెన్‌స్కీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ కూడా ఉన్నారు.ఇప్పటికే భారత్‌పై 25 శాతం పన్నులు విధించి అమల్లోకి తీసుకువచ్చిన ట్రంప్.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు మరో 25 శాతం పెనాల్టీ సుంకాలు విధిస్తామని సంచలన ప్రకటన చేసి విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు నిధులు సమకూర్చడమేనని ట్రంప్ ఆరోపించారు. దీనిపై ధీటుగా స్పందించిన భారత్.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చమురు కొనుగోలు ఖర్చులను తట్టుకోవడం ముఖ్యమని తెలిపింది.