ఉంటే అదృష్టమని అంతా చెబుతారు. కానీ బట్టతల ఉన్నవారికి అవమానాలే ఎదురవుతూ ఉంటాయి. అందుకే చాలా మంది రకరకాల నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. మరికొందరైతే విగ్గులు పెట్టుకోవడం, చేసుకోవడం, రకరకాల ట్రీట్‌మెంట్లు తీసుకుంటూ ఉంటారు. తల మీద వెంట్రుకలు లేకపోతే.. ఈ సమాజంలో పరువు పోతుందని భయపడి.. ఒక రకమైన అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా కళ్లతో కాకుండా మనసుతో పెట్టి చూస్తే.. అన్నీ పాజిటివ్‌గానే ఉంటాయి అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎందుకంటే సాధారణంగా బట్టతల ఉన్నవారు నామోషీగా ఫీల్ అయితే.. ఈ వ్యక్తి మాత్రం బట్టతలనే.. తన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. దీంతో నెలకు రూ.50 వేలు ఆర్జిస్తూ.. బట్టతల ఉన్నవారికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. తన బట్టతలను ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డ్ (బిల్ బోర్డు)గా మార్చేసి.. డబ్బులు సంపాదిస్తున్నాడు. అతడే కేరళకు చెందిన వ్లాగర్ షఫీక్ హషీమ్.మహిళలకైనా, పురుషులకైనా జుట్టు అనేది అందం. కానీ కొందరు పురుషులకు 30 ఏళ్లు దాటగానే బట్టతల వచ్చేస్తుంది. దీంతో చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. తోటివాళ్లు బట్టతల అని వెక్కిరిస్తుంటే.. లోలోపల, మానసికంగా చాలా కుంగిపోతారు. ఇక అలాంటివాళ్లు గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నాడు షఫీక్ హషీమ్. కంటెంట్ క్రియేటర్, ట్రావెల్ వ్లాగర్ అయిన షఫీక్ హషీమ్.. తన బట్టతలతో అద్భుతాన్ని సృష్టిస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన 36 ఏళ్ల షఫీక్ హషీమ్.. తన బట్టతలపై ఒక కంపెనీ లోగోను వేసుకుని.. దానికి ప్రమోషన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. 3 నెలలకు రూ.50వేలుసరికొత్త ఆలోచనలు, వినూత్న పద్ధతులతో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు.. తమ ఫాలోయింగ్‌ను పెంచుకోవడమే కాకుండా.. ప్రమోషన్లు, యాడ్స్ చేసి డబ్బులు వెనకేసుకుంటున్నారు. తనకు తానే సరికొత్త బ్రాండ్‌గా మారిపోయి షఫీక్ హషీమ్ అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. బట్టతలను ఒక అడ్వర్టైజింగ్ బోర్డుగా మార్చేసిన షఫీక్ హషీమ్.. మొదటి కాంట్రాక్ట్‌ను 3 నెలల కాలానికి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఆ కంపెనీ.. షఫీక్ హషీమ్‌కు రూ.50 వేలు చెల్లించనుంది. కొచ్చికి చెందిన ఒక హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌కు సంబంధించిన లోగోను తాత్కాలికంగా టాటూ రూపంలో తన బట్టతలపై వేయించుకున్నాడు. ఇక తాను తీసే వీడియోల్లో ఈ బ్రాండ్ ప్రమోషన్ చేయనున్నాడు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్మొదట బట్టతల కారణంగా తాను చాలా ఇబ్బందికి గురయ్యానని.. దీంతో తాను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు షఫీక్ హషీమ్ వెల్లడించాడు. అదే సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపాడు. చాలా లోతుగా ఆలోచించిన తర్వాత.. బట్టతల సహజమైందని.. అందులో సిగ్గుపడాల్సింది ఏం లేదని తాను గ్రహించినట్లు పేర్కొన్నాడు. అందుకే తాను దాన్ని ఉపయోగించుకుని.. డబ్బు సంపాదించే ఒక ఆదాయ మార్గంగా మార్చుకోవాలని అనుకున్నట్లు షఫీక్ చెప్పాడు. ఇక తన పని చాలా సులువు అని.. తాను యూట్యూబ్ వీడియోలు తీసే సమయంలో తన బట్టతలపై యాడ్స్ కోసం రకరకాల బ్రాండ్‌లను ఆహ్వానించడమేనని వెల్లడించాడు. ఈ బంపరాఫర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత.. అది చాలా వేగంగా మీడియా, కార్పొరేట్ సంస్థలకు చేరి.. వారిని ఆకర్షించిందని చెప్పుకొచ్చాడు. బట్టతల లాభదాయకమే!సదరు కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా.. వచ్చే 3 నెలల పాటు తన బట్టతలపై ఆ కంపెనీ యాడ్ స్పష్టంగా కనిపించేలా వీడియోలు తీస్తానని షఫీక్ హషీమ్ తెలిపాడు. యూజర్ల దృష్టిని ఆకర్షించేందుకు తన బట్టతలకు ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అయితే తన బట్టతలపై వేసుకున్న తాత్కాలిక టాటూను తొలగించడం పెద్ద కష్టమేమీ కాదని వెల్లడించాడు. కొన్ని రసాయనాల ఉపయోగించి.. సులభంగా తొలగించవచ్చని.. కానీ ఈ ఆలోచన మాత్రం పర్మినెంట్‌గా ఉంటుందని చెప్పాడు. ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం బట్టతలను ఇలా అద్దెకు ఇచ్చిన తొలి వ్యక్తిని దేశంలో, ప్రపంచంలోనే తానే అనుకుంటున్నానని వివరించాడు. ఆలోచన వెనుక అద్భుతంతాను బట్టతలను బిల్ బోర్డు‌గా మార్చడం డబ్బులు సంపాదించడానికో లేక సోషల్ మీడియా, మీడియాలో వైరల్ కావడం కోసం కాదని.. మనిషి రంగును, వేషాన్ని, ఆకారాన్ని ఈ సమాజం చూసే చూపును మార్చడం కోసమని.. మనలో ఉన్న లోపాలను ఎదుటి వారు హేళన చేయకుండా, వాటి వల్ల మనం ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. ఆత్మవిశ్వాసంతో మనలో ఉన్న లోపాన్ని ఎలా బలంగా మార్చుకోవచ్చో నిరూపించడమే తన ఉద్దేశ్యమని షఫీక్ హషీమ్ వెల్లడించాడు.కాలేజీ రోజుల నుంచే!తాను కాలేజీ చదివే రోజుల నుంచే బట్టతల ఉండేదని షఫీక్ హషీమ్ స్పష్టం చేశాడు. అయితే అప్పుడు ఫ్రెండ్స్ సరదాగా తనను బట్టతల విషయంలో ఆటపట్టించేవారని పేర్కొన్నాడు. దాన్ని తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. బట్టతల ఉన్నవారంతా ఇప్పుడు రకరకాల ట్రీట్‌మెంట్లు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటుంటే.. ఉన్న బట్టతల నుంచే డబ్బులు ఎందుకు సంపాదించకూడదు అని తాను అనుకున్నట్లు చెప్పాడు. మొదట తన ఆలోచనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిందని.. అది చివరికి ఓ సంస్థకు చేరి.. తనతో ఒప్పందం జరిగినట్లు వెల్లడించాడు. షఫీక్ యూట్యూబ్ ఛానల్షఫీక్‌ హషీమ్‌కు '70mm Vlogs' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌కు 28 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేరళ, సౌదీ అరేబియాలో ఒకప్పుడు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా పనిచేసిన షఫీక్ హషీమ్.. అదే అనుభవంతో ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతూ.. ఇలాంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాడు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరిన్ని యాడ్స్ రావాలని కోరుకుంటున్నాడు.