"తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం.. తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం.. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా.. తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా.. ఇది మరువబోకురా" అంటూ మన మాతృభాష గురించి మనం గొప్పగా పాడుకుంటాం. నిజానికి తెలుగు భాషాభివృద్ధిలో 'తెలుగు సినిమా' గణనీయమైన పాత్ర పోషించింది. ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. కానీ ఆధునిక పోకడల వెనుక పరుగులు తీయడం ప్రారంభించిన తర్వాత, తెలుగు సినిమాల్లో తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. తెలుగు సినిమాలకు కనీసం తెలుగు పేర్లు పెట్టడం లేదు. మరీ విడ్డూరంగా ఈ మధ్య కాలంలో డబ్బింగ్ చిత్రాలను ఒరిజినల్ వెర్షన్ టైటిల్స్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సినిమాలతో తెలుగు భాషా వికాసం... తెలుగు సినిమా ప్రారంభం నుంచీ భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసింది. పద్య నాటకాలు, సాంఘిక చిత్రాలు, జానపద కథలు – ఇలా ఏది వచ్చినా తెలుగుదనం ఉట్టిపడేది. తెలుగు సినిమా కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, ఒక విద్యా సాధనంగా, తెలుగు భాషాభివృద్ధికి ఒక వాహకంగా నిలిచింది. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల ద్వారా పద్యాలు, సామెతలు, జాతీయాలు ప్రజల్లోకి వెళ్ళాయి. సినీ గేయ రచయితలు అందించిన అనేక పాటలు తెలుగు సాహిత్యానికి కొత్త సొబగులు అద్దాయి. ఇక అలనాటి తెలుగు సినిమా టైటిల్లు అచ్చమైన తెలుగు పదాలతో, భాషా సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఉండేవి. అద్భుతమైన కథాంశాలతోనే కాకుండా, వాటి టైటిల్స్ తోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. మారిన ట్రెండ్.. మారుతున్న టైటిల్స్కాలం మారుతున్న కొద్దీ, సినిమా ట్రెండ్స్ కూడా మారాయి. ఒకప్పుడు ఆయా హీరోలను బట్టి, కథకు సరిపోయే అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చిన ఫిలిం మేకర్స్.. ఇప్పుడు నేటి తరాన్ని ఆకర్షించడం కోసం వింత వింత పేర్లను పెడుతున్నారు. తెలుగు-ఇంగ్లీష్ మిక్స్ చేసిన టింగ్లీష్ పదాలు.. తెలుగు-హిందీ పదాల కలయికతో.. అర్థం పర్థం లేని ఇతర భాషా పదాలతో టైటిల్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఇది కేవలం స్ట్రెయిట్ తెలుగు చిత్రాల విషయంలోనే కాదు, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదం చేయబడే డబ్బింగ్ సినిమాలలోనూ ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది.ఒరిజినల్ టైటిల్స్‌తోనే తెలుగులోకి డబ్బింగ్...ఒకప్పుడు వేరే భాషల చిత్రాలు తెలుగులోకి వస్తున్నాయంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. టైటిల్, డబ్బింగ్, ఊరి పేర్లు ఇలా అన్నింట్లో జాగ్రత్త వహించేవారు. మన ప్రేక్షకులను ఆకట్టుకోడానికి నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూసుకునేవారు. తెలుగులో అర్థవంతమైన, ఆకట్టుకునే పేర్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. కనీసం టైటిల్ కూడా మార్చడం లేదు. డబ్బింగ్ సినిమాలను తమ ఒరిజినల్ వెర్షన్ టైటిల్స్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 'పాన్ ఇండియా' ట్రెండ్ పేరు చెప్పి, తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం సంబంధం లేని పదాలను బలవంతంగా మన భాషలోకి రుద్దుతున్నారు. దీనిపై తెలుగు భాషాభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ పేర్లకు అర్థమేంటి మాస్టారూ..?ఉదాహరణకు, తమిళ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమాకి ఇటీవలే 'కరుప్పు' అనే పేరు ఖరారు చేశారు. తెలుగులోనే ఇదే పేరుతో టైటిల్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేశారు. 'కరుప్పు' అనే పదానికి తెలుగుతో అసలు సంబంధమే లేదు. అంతకుముందు వచ్చిన 'కంగువ', 'వేట్టయాన్', 'పొన్నియన్ సెల్వన్', 'ఈటీ', 'వలిమై', 'రాయన్', 'తంగలాన్', 'అమరన్', 'అయలాన్' వంటి సినిమా పేర్లకు తెలుగులో అర్థాలే లేవు. తమిళ చిత్రాలను చూసి మలయాళ సినిమాలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. 'తుడురమ్', 'మంజుమల్ బాయ్స్', 'ఎంపురాన్'.. అంటూ మలయాళ పేర్లతోనే తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వాటి మీనింగ్ ఏంటో తెలియక తెలుగు ప్రేక్షకులు జుట్టు పీక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారా?డబ్బింగ్ సినిమాలకు అరవ, మలయాళ టైటిల్లు పెట్టడం చూస్తుంటే.. తెలుగు ప్రేక్షకులను వాళ్లు ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. కానీ తెలుగు భాషను బ్రతికించండి అంటూ గగ్గోలు పెడుతున్న తెలుగు భాషా ప్రేమికులు సైతం ఈ ధోరణిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. తెలుగులోకి పరభాషా చిత్రాలను తీసుకొస్తున్న టాలీవుడ్ నిర్మాతలు.. కేవలం వ్యాపారం మాత్రమే ముఖ్యం అన్నట్టుగా పట్టీ పట్టనట్టుగా ఉంటున్నారు. 'తెలుగు భాష గురించి మాకెందుకు?' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. అబ్బూరి రవి లాంటి సినీ రచయితలు మాత్రం అప్పుడప్పుడు ఈ ధోరణిపై అభ్యంతరం చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరులోనే అంతా ఉంది...వాస్తవానికి తెలుగు పేర్లు పెట్టని సినిమాలను తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. దీనికి కారణంగా అసలు ఆ టైటిల్స్ జనాలకి ఎక్కడం లేదు. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల రేంజ్ లో వసూళ్లు రాబడితే, ఇప్పుడు మాత్రం అసలు ఎప్పుడొచ్చాయో తెలియకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. టైటిల్స్ తోనే సగం ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా చేస్తున్నారు కాబట్టే, తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాతో మమేకం అవడం లేదు. పేర్లలోనే స్థానికత, భాషా సౌందర్యం లేకపోతే జనాలు ఆ సినిమాని ఎందుకు చూస్తారు?. అందుకే మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇతర భాషల్లో రూపొందించే సినిమాలకు ఆయా భాషల్లోనే టైటిల్స్ పెడుతున్నారు. 'సరిపోదా శనివారం' సినిమాకి ఇతర భాషల్లో 'సూర్యాస్ సాటర్ డే' అనే పేరు పెట్టారు. 'సార్' మూవీని తమిళంలో 'వాతి' టైటిల్ తో రిలీజ్ చేశారు. దిల్ రాజు తమిళంలో తీసిన 'వారిసు' సినిమాని తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేశారు. ఇకపై తెలుగులోనే డబ్బింగ్ సినిమాల టైటిల్స్...తెలుగు నేలపై సినిమాలను విడుదల చేస్తూ, తెలుగులో టైటిల్ పెట్టకపోవడం 'తెలుగు'ను చిన్నచూపు చూడటమే అవుతుంది. తెలుగు వారిని, వారి భాషను లెక్క చేయకపోవడమే అవుతుంది. డబ్బింగ్ సినిమాల విషయంలో జరుగుతున్న ఈ తప్పును ఇప్పటికైనా సరిదిద్దాలి. పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేసేటప్పుడు, ఖచ్చితంగా తెలుగులోనే అర్థవంతమైన టైటిల్స్ పెట్టాలి. తెలుగు పేరు పెడితేనే రిలీజ్ చేస్తామని డబ్బింగ్ సినిమాల నిర్మాతలు, పంపిణీదారులు గట్టిగా చెప్పాలి. తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ విభాగాలు, భాషా సంఘాలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. సినిమా టైటిల్స్ విషయంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కన్నడలో భాషాభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని కమల్ హాసన్ అన్నందుకు ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాని ఏకంగా కర్ణాటకలో బ్యాన్ చేసే వరకూ వెళ్ళారు. గేమ్ చేంజర్ మూవీని కన్నడలో కాకుండా తెలుగులో రిలీజ్ చేస్తున్నారని కన్నడిగులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇటీవలే 'హరి హర వీరమల్లు' సినిమాకి కన్నడ పోస్టర్లు లేవంటూ థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చింపేశారు. తెలుగులోకి ఇతర భాషా పదాలను బలవంతంగా రుద్దితే, రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు థియేటర్ల వద్ద నిరసనలు తెలియజేసే అవకాశం లేకపోలేదు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారంటే, అది కేవలం ఒక రాజు అభిమానం కాదు. అది తెలుగు భాషకున్న అపురూపమైన మాధుర్యానికి, సంస్కృతికి అద్దం పట్టే వాస్తవం. కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి మహానుభావులు తెలుగు భాషా పరిరక్షణకు, వ్యాప్తికి చేసిన కృషి అపారమైనది. "తెలుగు భాష తల్లి వంటిది. అది మనకు జన్మనిచ్చిన తరువాత మనకు జ్ఞానాన్ని కూడా ప్రసాదించింది" అనే సినారే మాటలు తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. "తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోని రాయాలి. తెలుగులోనే పాలన చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్పు రావాలి".. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన మాటలవి. మాతృభాష తల్లి పాల వంటిది. పరభాష పోతపాల వంటిదని కొమర్రాజు లక్ష్మణరావు అన్న మాట సత్యం. 'అమ్మ భాష'ను కాపాడుకుందాం...సినిమా అనేది సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపించే మాధ్యమం. కాబట్టి డబ్బింగ్ చిత్రాలను విడుదల చేసే నిర్మాతలు, పంపిణీదారులు తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. తెలుగు భాషా వైభవం, 'అమ్మ భాష' మధురిమను గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సినిమా ద్వారా తెలుగు భాషా వికాసం కోసం తమవంతు కృషి చేయాల్సిన అవసరముంది. వాడుక భాషలో ఉన్న ఇంగ్లీష్ హిందీ పదాలను, నామవాచకాలను టైటిల్స్ గా పెడితే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు కానీ, మరీ ఇతర భాషల్లోని క్రియానామాలను కూడా తెలుగులోకి తీసుకురావడం సరికాదు. ఇప్పటి నుంచైనా తెలుగులో విడుదల చేసే పరభాషా చిత్రాలకు 'తెలుగు టైటిల్స్' పెడతారని ఆశిద్దాం.