'మా కుమార్తె చనిపోయింది.. వరకట్నం వెనక్కివ్వండి'.. భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా

Wait 5 sec.

కుమార్తె మృతి చెందడంతో ఆమె పెళ్లి సమయంలో ఇచ్చిన వరకట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన ఘటన జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో ఇచ్చిన 30 తులాల బంగారం, రూ.50 లక్షల నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో నిరసన వ్యక్తంచేశారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. రామకృష్ణాపూర్ పట్టణం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేష్ వివాహం 2021లో అదే పట్టణానికి చెందిన లావణ్య (29)తో జరిగింది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొన్ని రోజులుగా లావణ్య తన పుట్టింట్లో ఉంటోంది.ఈ నెల 16న లావణ్య తన తండ్రి, సింగరేణి కార్మికుడైన గాండ్ల సత్యంతో కలిసి వెళ్తుండగా.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట స్టేజీ సమీపంలో ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన లావణ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఈనెల 25న లావణ్య మృతి చెందింది. సురేష్, లావణ్యల మధ్య ఉన్న వివాదాల కారణంగా, పోస్టుమార్టం అనంతరం మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో భర్త సురేష్ ఇంటికి తీసుకొచ్చి వరకట్నం తిరిగి ఇవ్వాలని లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా మృతదేహాన్ని ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కట్నం డబ్బులు తిరిగి ఇవ్వకుంటే అంత్యక్రియలు నిర్వహించబోమని బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రెండు రోజులుగా లావణ్య మృతదేహం అంబులెన్స్‌లోనే ఉండిపోయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని వారి స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ఓదెలకు పంపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.