సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌బజార్‌లోని ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు, వైద్యాధికారులు పలు కీలక పత్రాలు, వీర్య కణాల శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్టు తేలింది. వీర్యం దానం చేసేవారికి ఒక్కొక్కరికి రూ.5- 10 వేల వరకు ఇస్తున్నట్లు తెలిసింది. ఫోర్న్ వీడియోల చూపించి వారితో వీర్యం సేకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారి ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా వీర్యం దానం చేస్తున్నట్లు తెలిసింది. ఇలా సేకరించిన వీర్య కణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్‌ బజార్‌లో ఇండియన్ స్పెర్మ్‌టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ దందాపై పోలీసులు మరింత లోతైన విచారణ జరుపుతున్నారు.ఎలా బయటడిదంటే..? నాలుగేళ్లుగా సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సంతానలేమితో మూడేళ్ల క్రితం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా రూ.30 లక్షలతో పిల్లలకు అవకాశం ఉందని డాక్టర్ నమ్రత వారికి హామీ ఇచ్చారు. గతేడాది ఆగస్టులో దంపతులు మొత్తం డబ్బు చెల్లించారు. బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ డీఎన్‌ఏ నమూనాలను సేకరించి పోల్చాలని దంపతులు షరతు విధించారు.ఈ ఏడాది బిడ్డ జన్మించింది. షరతు ప్రకారం డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని దంపతులు కోరగా, నమ్రత తరచు వాయిదాలు వేసింది. దీంతో దంపతులు ఢిల్లీలో డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోగా, తల్లిదండ్రుల డీఎన్‌ఏతో బిడ్డ డీఎన్‌ఏ సరిపోలలేదు. జూన్ రెండోవారంలో వైద్యురాలిని సంప్రదించగా, ఆమె తప్పును అంగీకరించి సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని అడిగింది. కానీ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. తాము మోసపోయామని భావించిన దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.