. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ డ్రగ్స్ దందాను నామరూపాలు లేకుండా చేస్తోంది. మొన్నామధ్య మల్నాడు కిచెన్‌లో డ్రగ్స్ దందాను వెలుగులోకి తీసుకొచ్చిన ఈగల్.. తాజాగా రూ. 5 కోట్ల విలువజేసే గంజాయిను పట్టుకున్నారు. బాటసింగారం వద్ద ఖమ్మం ఈగల్ టీమ్ భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. పండ్లు సరఫరా చేసే ట్రేలలో పెట్టి తరలిస్తున్న భారీ గంజాయి నిల్వలను పట్టుకుంది. ఈగల్, రాచకొండ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 435 ప్యాకెట్లలో ఉన్న గంజాయి విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఓ డీసీఎంపై పోలీసులకు అనుమానం వచ్చింది. పండ్ల ట్రేలతో ఉన్న ఆ డీఎసీఎంను ఈగల్, రాచకొండ పోలీసులు పండ్ల మార్కెట్ సమీపంలో ఆపి తనిఖీలు నిర్వహించారు. డీసీఎం లోపల చూడగా 35 సంచుల్లో 455 గంజాయి ప్యాకెట్లను పండ్ల ట్రేలలో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో వెంటనే డీసీఎంను సీజ్ చేసిన పోలీసులు.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ 435 ప్యాకెట్లలో 935 కిలోల గంజాయి ఉందని తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన పవార్ కుమార్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. విక్కీ సేత్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. డీఎసీఎంకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న ఇన్నోవా కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.