ఏఐ వల్ల న్యూక్లియర్ వార్..! సైంటిస్టులు ఏం చెబుతున్నారు?

Wait 5 sec.

"నిజం గడపదాటే లోపు.. అబద్ధం ఊరు చుట్టి వస్తుందట".. అంటే వాస్తవాల కన్నా అసత్యాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జనాలు. ఇలాంటి అబద్దాలను రెట్టింపు చేసి.. పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చి.. అణుయుద్ధాలతో భూమండలం సర్వనాశనం అయ్యేలా చేయగలదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!. జరిగినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు సైంటిస్టులు. అసలు శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయానికి రావడానికి గల కారణాలేంటి? ఏఐ వల్ల ఎలా అణు యుద్ధం వస్తుంది? దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా 80 ఏళ్ల క్రితం జులై నెలలోనే.. అమెరికా మిలిటరీ న్యూ మెక్సికో ఎడారిలోని ట్రినిటీ టెస్ట్‌సైట్‌లో అణు బాంబు పరీక్ష జరిపి మానవాళిని అణుయుగంలోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత మూడు వారాలకే.. అమెరికా బాంబర్లు (యుద్ధ విమానాలు) జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అణు బాంబులు జారవిడిచాయి. ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన అణు బాంబులు.. వేల మందిని బలితీసుకున్నాయి. ఆ క్షణం నుంచి అలాంటి భయానక దృశ్యాలు మళ్లీ ఈ భూమిపై సంభవించకూడదని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కోరుకుంటున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ భయాలు మొదలయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో హమాస్-ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల.. ఇక అణు గండం తప్పదేమో అనే పరిస్థితులు తెలెత్తాయి. ప్రస్తుతం 9 దేశాలు- అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. న్యూక్లియర్ వార్ జరిగే అవకాశం గడిచిన కొన్ని దశాబ్దాలలో లేనంత ఎక్కువగా ఇప్పుడు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్రిక్తమయంగా ఉన్న ప్రపంచం అణు యుద్ధానికి రంగస్థలంగా మారే అవకాశం ఉందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడం, ఉత్తర కొరియా కవ్వింపులు, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడం వల్ల అనిశ్చితి నెలకొందని అంటున్నారు. ఏఐ వల్ల అణు యుద్ధం..ప్రస్తుతం ప్రపంచంలో 12,000 పైగా న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని అణ్వాయుధ దేశాల మధ్య శత్రుత్వం ఉంది. అయితే ఇవి మాత్రమే కాకుండా కృత్రిమ మేధ (ఏఐ) కూడా అణు యుద్ధాలు జరిగే ప్రమాదాన్ని మరింత పెంచుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిస్టుల ప్రకారం.. ఏఐ వల్ల తప్పుడు సమాచారం (Misinformation) విపరీతంగా పెరుగుతోంది. దీని వల్ల అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. తద్వారా ముప్పులను తప్పుగా అర్థం చేసుకుంటే అనాలోచిత దాడులకు కారణమయ్యే అవకాశం ఉంది. అది అణు యుద్ధానికి దారితీయవచ్చని అంటున్నారు. ఇది ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులు జరిగిన యుద్ధంలో స్పష్టమైంది. ఇరు దేశాల సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ విచ్చలవిడిగా సృష్టించి.. పిరికి యుద్ధం చేసింది. యుద్ధం జరుగుతుండగా ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల.. అపార్థాలు పెరిగి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తలు మాట.వీటికి తోడు యుద్ధాల్లో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మిలిటరీలు ఏఐని ఇప్పటికే పలు వ్యవస్థల్లో భాగం చేశాయి. ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు ఇంటెలిజెన్స్ డేటాను విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటికోసం కాకుండా.. అణ్వాయుధ కార్యకలాపాల్లో ఎంత లోతుగా ఏఐను వినియోగిస్తున్నారో కచ్చితమైన సమాచారం లేదు. అయితే కొన్ని అణ్వాయుధ దేశాలు ఈ పని ప్రారంభించాయని నిపుణులు భావిస్తున్నారు. ఎక్కువ ఏఐ వినియోగంతో చర్చలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏఐ ఇచ్చిన అనాలసిస్ రిపోర్టు ఆధారంగా వేగంగా నిర్ణయాలు తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. దీని వల్ల అణ్వాయుధాలు ఉపయోగించే విషయంలోనూ తప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా అణుబాంబు ప్రయోగించాలంటే.. అత్యంత జాగ్రత్తగా సుదీర్ఘ చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అన్‌మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికిల్స్ (UCAVs) వంటి అటోనమస్ ఆయుధాలను ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి అటాక్‌ల వల్ల తమ డిఫెన్స్ వ్యవస్థలు కూలిపోతున్నాయని.. అణు బాంబును ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల్లో కూడా ఏర్పడ్డాయి. భారత్ ప్రయోగించిన క్షిపణులు పాక్ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశాయి. అలాంటి సమయాల్లో పరిస్థితులు తీవ్రంగా మారి.. ఇరు దేశాలు అణ్వాయుధాలు ప్రయోగించుకునే ముప్పు ఉందని విశ్లేషణలు వచ్చాయి. న్యూక్లియార్ వార్ రిస్క్ తగ్గించాలంటే ఏం చేయాలి?ఈ నెల (జులై) 14న అమెరికాలోని యూనివర్సిటీలో ఆఫ్ చికాగోలో నోబెల్ ప్రైజ్ గ్రహీతలు సమావేశమయ్యారు. అణు యుద్ధాన్ని నివారించడానికి (Nobel Laureate Assembly for the ).. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నోబెల్ గ్రహీతలతో పాటు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, శాంతి ప్రచారకర్తలు, విధాన రూపకర్తలు హాజరయ్యారు. భవిష్యత్తులో అణు యుద్ధాన్ని ఎలా నివారించాలో అనే అంశంపై సమాలోచనలు చేశారు. అనంతరం.. ఆయుధ నియంత్రణ ఒప్పందాలను పునరుద్ధరించడం, ఆయుధ వ్యవస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగాన్ని పరిమితం చేయడం సహా అణ్వాయుధ ప్రమాదం తగ్గింపు కోసం పలు సిఫార్సులు చేశారు. ఏఐ ఎంత వేగంగా తన వేశాలు మారుస్తూ.. ఎన్ని రంగాల్లో ప్రవేశిస్తుందో చూస్తూనే ఉన్నాం. చివరకు ఇది మిలిటరీ వ్యవస్థల్లో కూడా భాగం అయిపోతుంది. అయితే ఏఐ వల్ల న్యూక్లియర్ యుద్ధాలు జరుగుతాయనేది ఇప్పటికి భయాలు మాత్రమే. కానీ భవిష్యత్తులో ఈ భయాలు నిజం కావని మాత్రం చెప్పలేం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలే అందుకు నిదర్శనం. సైంటిస్టులు సైతం ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలపై హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నవే కాకుండా మరికొన్ని దేశాలు కూడా అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఎదురుచూస్తున్నాయని వార్తలు వస్తున్నాయ. ఈ నేపథ్యంలో న్యూక్లియర్ ముప్పును అరికట్టే బాధ్యత ఐరాస భద్రతా మండలిపైనే ఎక్కువగా ఉంది. అణ్వాయుధ దేశాల మధ్య సమన్వయాన్ని, నమ్మకాన్ని కలిగించేలా సమావేశాలు నిర్వహించాలి. ముఖ్యంగా న్యూక్లియర్ కమాండ్‌లో ఏఐ వాడకం తగ్గించేలా కఠిన మార్గదర్శకాలు రూపొందించి అణ్వాయుధ దేశాలు వాటికి కట్టుబడి ఉండేలా, మరింత బాధ్యతతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి.