: ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ముందుగానే మనం ఊహించలేం. మార్కెట్లపై సరైన అవగాహన ఉన్నప్పుడే.. ఆయా కంపెనీల నుంచి వచ్చే ప్రకటనలు, ప్రణాళికలు, పెట్టుబడి వ్యూహాలు, ఫలితాలు ఇలా ఇవన్నీ స్టాక్ గమనంతో పాటు స్టాక్ మార్కెట్ గమనాన్ని కూడా నిర్దేశిస్తుంటాయి. అందుకే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇంకా సరైన సమయంలో సరైన కంపెనీ స్టాక్‌ను నిపుణుల సలహాతో ఎంచుకోవాలి. ఇదే సమయంలో షార్ట్ టర్మ్‌లోనే లాభాలు రావాలని కూర్చోవద్దు. ఓపిక ఉండాలి. దీర్ఘ కాలంలోనే బంపర్ రిటర్న్స్ వస్తుంటాయని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే గత కొంత కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. వరుస సెషన్లలో పతనం దిశగానే సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడితో ఆయా షేర్లను విక్రయిస్తుండటం కారణంగా స్టాక్స్ పడిపోతుండటంతో పాటు వారు కూడా నష్టాల్ని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, కార్పొరేట్ కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలకు తోడు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కఠిన నిర్ణయాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి.భారీగా పడిపోతున్న రిలయన్స్ షేర్లు..ఇక గత వారం కూడా సూచీలు భారీగానే పడిపోయాయి. బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 294.64 పాయింట్లు పడిపోయింది. ఈ క్రమంలోనే చాలా స్టాక్స్ పడిపోగా.. దేశంలో మార్కెట్ విలువ పరంగా టాప్-10 కంపెనీల్లో 6 కంపెనీల విలువనే ఏకంగా రూ. 2.22 లక్షల కోట్లు తగ్గడం గమనార్హం. ఇందులో ఉంది. రిలయన్స్ సంస్థ ఎం- క్యాప్ 5 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1.14 లక్షల కోట్లు తగ్గగా ఇప్పుడు అది రూ. 18.83 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఆ తర్వాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫీ మార్కెట్ విలువ గత వారం రూ. 29 వేల కోట్లకుపైగా తగ్గగా ప్రస్తుతం ఎం - క్యాప్ రూ. 6.29 లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. రూ. 23 వేల కోట్ల పతనంతో రూ. 5.60 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఇక టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20 వేల కోట్లు తగ్గి రూ. 11.34 లక్షల కోట్లకు పడిపోయింది. బజాజ్ ఫినాన్స్ ఎం క్యాప్ రూ. 17 వేల కోట్లు తగ్గింది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ విలువ రూ. 17 వేల కోట్లు పడిపోయింది. వీటికి భిన్నంగా మరో 4 కంపెనీల విలువ అమాంతం పెరిగింది. ఫలితాల్లో ఈ కంపెనీలు అంచనాల్ని మించగా.. షేర్లు పెరిగాయి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్‌లో నిలిచింది. ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 37 వేల కోట్లు పెరిగి రూ. 15.38 లక్షల కోట్లకు ఎగబాకింది. ఐసీఐసీఐ బ్యాంకు ఎం క్యాప్ రూ. 35 వేల కోట్లు పెరగడంతో రూ. 10.53 లక్షల కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 20 వేల కోట్లు పెరిగి రూ. 11.04 లక్షల కోట్ల వద్ద ఉంది. అంతకుముందు వారం ఇది మార్కెట్ విలువలో టీసీఎస్‌ను మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తగ్గింది. ఎస్బీఐ ఎం - క్యాప్ రూ. 9 వేల కోట్లు పెరిగి రూ. 7.44 లక్షల కోట్లకు చేరింది.