Ration Cards Distribution Across Andhra Pradesh: ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెరపడింది. ఏపీలో త్వరలోనే జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే నెల మొదటి వారం నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్తోంది. అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారికి ఎప్పటి నుంచి ఇస్తారనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని పేదలకు ఆగస్ట్ 25 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కొత్త రేషన్ కార్డుల జారీపై పలు కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో క్యూఆర్ కోడ్‌తో ఉండే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని.. కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవని స్పష్టం చేశారు. డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా కొత్త రేషన్ కార్డులు ఉంటాయన్నారు. రేషన్ షాపులలోని ఈ-పోస్ యంత్రాల వద్ద ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేసి రేషన్ సరుకులు పొందవచ్చని నాదెండ్ల మనోహర్ వివరించారు. స్కాన్ చేయగానే రేషన్ కార్డు వివరాలు, రేషన్ సరుకుల సమాచారం వస్తుందని తెలిపారు.కొత్త రేషన్ కార్డుల కోసం 9 లక్షల మంది.. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వివరించారు. కొత్త వాటితో కలిపితే ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 45 లక్షల 97 వేలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి వివరించారు. రేషన్ కార్డు మీద కుటుంబసభ్యులు, యజమాని ఫోటో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 31 వరకూ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింటింగ్ కోసం ఇటీవల ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం కార్డుల ముద్రణ జరుగుతోంది.