నిత్యం వెలుగులు పంచే సూర్యుడిని చాలా సాంప్రదాయాల్లో ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. సకల జీవరాశికి ప్రాణదాతగా చెబుతారు. అయితే సూర్యుడు కేవలం జీవరాశులకే కాదు.. వాహనాలకు శక్తి దాతగా పరిణమించాడు. సౌర శక్తితో నడిచే వాననాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతున్నా.. పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీపై నడిచే వాహనాలు ఎక్కువగా రావడం లేదు. పవర్ సప్లై, స్టోరేజీ తదితర కారణాలు అడ్డంకిగా మారాయి. అయితే ప్రపంచంలోనే మొట్ట మొదటి పూర్తి స్థాయి సోలార్ రైలు మాత్రం.. కొన్నేళ్లుగా విజయవంతంగా సేవలు అందిస్తోంది. ఇంతకీ ఆ ఎక్కడ ఉంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైన్‌ను (first fully solar powered passenger train) ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని బైరా్న్ బే పట్టణంలో ( in Australia ) నడుపుతున్నారు. ఇది సిటీ సెంటర్ నుంచి నార్త్ బీచ్ ప్రిసింక్ట్ ( North Beach precinct) వరకు 3 కిలోమీటర్ల మార్గంలో పరుగులు పెడుతోంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సోలార్ ట్రైన్.. ఇప్పుడున్న మోడర్న్ డబ్బాల్లా కాకుండా.. వింటేజ్ లుక్‌లో ఉంది. అంటే.. 1949ల నాటి డీజిల్ ఇంజిన్ టూ-క్యారేజ్ రైల్‌కార్‌ను మోడిఫై చేసి సోలార్ ట్రైన్‌గా మార్చారు. ఈ సోలార్ ట్రైన్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన 6.5 kW సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ట్రైన్ ఆకారంలో కలిసిపోయాలా.. పైకప్పులో సోలార్ ప్యానెల్స్ అమర్చారు. దీంతో పాటు ట్రైన్ షెడ్‌పై అదనంగా 30 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రైన్‌లో 77 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. సాధారణంగా మనం ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ పెట్టినట్లే.. ఈ ట్రైన్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 12 నుంచి 15 ట్రిప్స్ వరకు సులభంగా ప్రయాణం చేయొచ్చు. అలా కాకున్నా మార్గమధ్యలోనే కూడా ఈ సోలార్ ట్రైన్ కరెంట్ జనరేట్ చేస్తుంది. టిక్కెట్ రేట్లు ఇవే..దాదాపు 88 టన్నుల బరువుండే ఈ సోలార్ ట్రైన్‌లో 92 నుంచి 100 మంది ప్యాసింజర్లు ప్రయాణం చేయవచ్చు. ఒక్క క్రిస్ట్‌మస్ నాడు తప్ప సంవత్సరం మొత్తం ఈ ట్రైన్ సేవలందిస్తుంది. ఈ ట్రైన్‌ ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే.. పెద్దవాళ్లు ఒక ట్రిప్‌నకు 5 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాలి. 6 నుంచి 13 ఏళ్ల పిల్లలు టిక్కెట్‌కు 3 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఐదేళ్లలోపు పిల్లలకు ప్రయాణం ఫ్రీ. లగ్గేజ్‌, బైక్స్, సర్ఫ్‌బోర్డులు వంటి వాటిని ఫ్రీగా ఈ ట్రైన్‌లో తీసుకెళ్లొచ్చు. ఈ ఐడియా ఎలా వచ్చింది?బైరాన్ బే పట్టణంలో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రెండు సిటీ సెంటర్ల మధ్య ఒక డీజిల్ ట్రైన్ నడిపించాలనుకున్నారు. దీనికోసం నిరుపయోగంగా ఉన్న రైల్ లైన్ ను ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం అప్రూవల్స్ వచ్చేసరికి.. సోలార్ టెక్నాలజీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో పట్టణ ప్రజలకు జీరో ఎమిషన్, కార్భన్ ఫ్రీ ప్రజా రవాణాను అందించాలనే ఉద్దేశంతో సోలార్‌తో నడిచే రైల్‌ను అభివృద్ధి చేయామని ప్రణాళిక వేశారు. అలా ప్రపంచంలోనే మొట్టమొదట సోలార్ ట్రైన్‌కు బీజం పడింది. అందుకోసం అనువుగా ఉండే తక్కువ బరువైన 1949 నాటి అల్యుమినియమ్ రైల్ కార్‌ను సోలార్ ట్రైన్‌గా మార్చారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగపడేందుకు ఒక డీజిల్ ఇంజిన్‌ను కూడా ఇందులో అమర్చారు. ఈ సోలార్ ట్రైన్ రాకతో వాహనాల ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా కారు ట్రిప్పులు కూడా తగ్గాయని అంటున్నారు. ఈ సోలార్ ట్రైన్ అభివృద్ధి చేసే క్రమంలో చాలా సమస్యలు వచ్చాయి. సూర్యకాంతి ఎప్పుడూ ఒకేలా రాదు. రోజులో ఉదయం, సాయంత్రం.. సీజన్లను బట్టి మారుతూ ఉంటుంది. ఈ కారణంగా ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ డిమాండ్‌కు మధ్య సమతుల్యత లేదు. అందుకే ఎనర్జీ బ్యాకప్- బ్యాటరీ వ్యవస్థలు అవసరమయ్యాయి. అయితే సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలను అనుసంధానించే పక్రియలో పలు సమస్యలు వచ్చాయి. అంతేకాకుండా.. సోలార్ ప్యానెల్స్, మోటార్లు, బ్యాటరీల ఎంపిక కూడా క్లిష్టంగా మారింది. వీటన్నింటినీ అధిగమించి పట్టాలపై రైలు పరులుగు పెట్టేలా చేశారు. ఇండియా ఇంతకుముందే చేసింది!ఇంతకుముందు జులై 2017లో భారత్ రైలు రూఫ్‌టాప్‌పై సోలాన్ ప్యానెల్స్ అమర్చింది. కాగా ఆస్ట్రేలియా బైరాన్ బేలో డిసెంబర్ 2017న సోలార్ ట్రైన్‌ను తీసుకొచ్చింది. అయినా ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ట్రైన్‌ బైరాన్ బేగా చెబుతారు. ఎందకంటే.. భారత్‌లో తయారైంది సోలార్ అధారంగా నడిచే డీజిల్‌ ( diesel electrical multiple unit- DEMU ) హైబ్రిడ్ ట్రైన్లు. కానీ బైరాన్ బేలో ట్రైన్ మొత్తం సోలార్ శక్తి ఆధారంగా నడుస్తుంది.ఎక్కువ దూరాలు, కార్గోకు సోలార్ రైళ్లు..?తక్కువ దూరాల్లో నడిచే సోలార్ రైళ్లుకు.. బైరాన్ బే ఒక చక్కని ఉదాహారణ. అయితే ఎక్కువ దూరాలకు, కార్గోలకు సోరాల్ ట్రైన్లు వాడొచ్చా అంటే..? వాడొచ్చు. కానీ పలు సాంకేతిక, ఆర్థిక, మౌలికసదుపాయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణాలకు ఎక్కువ సౌర శక్తి అవసరం అవుతుంది. ట్రైన్‌పై పరిమితంగా ప్లేస్ ఉంటుంది కాబట్టి.. ఎక్కువ ప్యానెల్స్ పెట్టి.. ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేయలేము. పూర్తిగా సౌర శక్తితో నడిచే ట్రైన్ల కోసం ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలు అవసరం అవుతాయి. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే.. హైస్పీడ్, కార్గో ట్రైన్లను నడపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ట్రాక్‌ల వెంబడి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే.. డిమాండ్‌కు తగ్గట్టుగా ఎనర్జీని ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. ఇలాంటి అరేంజ్‌మెంట్లు చేసుకుని లాంగ్ రేంజ్ ట్రైన్లు నడపొచ్చని చెబుతున్నారు. దీనిపై భారత్‌తో పాటు పలు దేశాలు పరిశోధనలు జరుపుతున్నాయి. పూర్తిస్థాయి సోలార్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తే.. రవాణా వ్యవస్థలో ఊహించని మార్పులు వస్తాయి.